ప్రత్యామ్నాయమేదీ..? | farmers ready to crop | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయమేదీ..?

Published Sun, Aug 13 2017 10:53 PM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

ప్రత్యామ్నాయమేదీ..? - Sakshi

ప్రత్యామ్నాయమేదీ..?

వర్షంరాకతో సాగుకు సిద్ధమైన రైతన్న
విత్తనాలు అందుబాటులో లేక కష్టాలు
త్వరలో అంటూ తప్పించుకుంటున్న వ్యవసాయశాఖ


అనంతపురం అగ్రికల్చర్‌: చాన్నాళ్ల తర్వాత జిల్లా వ్యాప్తంగా నాలుగైదు రోజులుగా వర్షం పడుతోంది. జూలై ఆఖరితోనే ప్రధాన పంటల సాగుకు సమయం ముగిసిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ, పత్తి, కంది లాంటి పంటలు వేసుకోవద్దని శాస్త్రవేత్తలు, అధికారులు ప్రకటించారు. అంతేకాదు సజ్జ, కొర్ర, జొన్న, అలసంద, పెసర, ఉలవ లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. కానీ... రైతుల దగ్గర విత్తనాలు లేవు. జూలై 15 నుంచి ప్రత్యామ్నాయ పంటలు, విత్తన ప్రణాళికలు, ప్రతిపాదనలు, నివేదికలు అంటూ వ్యవసాయశాఖ హడావుడి చేస్తున్నా ఇంతవరకు విత్తనాలు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది.

ప్రతిపాదనల్లోనే ప్రత్యామ్నాయం
ఆగస్టు ఒకటో తేదీ వ్యవసాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్, వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్య శాస్త్రవేత్తలు ఆరు జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలను పిలిపించి ప్రత్యామ్నాయంపై చర్చాగోష్టి నిర్వహించి జిల్లాల వారీగా విత్తన ప్రతిపాదనలు తయారు చేశారు. ఒకటో తేదీ నుంచే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలులోకి వచ్చిందని గొప్పగా ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో విత్తన సరఫరా, పంపిణీ ఏర్పాట్లు చేస్తామన్నారు. కానీ 15వ తేదీ వస్తున్నా ఆచరణలోకి రాని పరిస్థితి నెలకొంది.

భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం
జూన్, జూలైలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు కారణంగా ఖరీఫ్‌లో ప్రధాన పంటల సాగు పడకేశాయి. 6.04 లక్షల హెక్టార్లకు గానూ వేరుశనగ పంట 2.08 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. మిగతా పంటలన్నీ మరో 50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. ఇంకా 5.50 లక్షల హెక్టార్ల వరకు భూములు ఖాళీగానే ఉన్నాయి. మొత్తమ్మీద 8.01 లక్షల హెక్టార్లకు గానూ వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి అన్ని పంటలు కలిపి 30 శాతం విస్తీర్ణం అంటే 2.55 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. జిల్లా రైతుల మంచికో చెడుకో కానీ ఈసారి చిరుధాన్యాలు, నవధాన్యాల పంటలు సాగు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఏక పంట విధానానికి స్వస్తిపలకడం, పంట మార్పిడికి అవకాశం రావడంతో సరికొత్త వ్యవసాయానికి మార్గం లభించినట్లు చెబుతున్నారు.
 
ప్రతిపాదనలకే పరిమితం
ప్రత్యామ్నాయ విత్తన ప్రతిపాదనలు ఇప్పటికే నాలుగు సార్లు తయారు చేసి కమిషనరేట్‌కు పంపినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు చెబుతున్నారు. మొదట 67 వేల క్వింటాళ్లు, తర్వాత 84 వేల క్వింటాళ్లు, మూడో సారి 48 వేల క్వింటాళ్లు, తాజాగా 1.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రతిపాదనలు పంపారు. అత్యధికంగా 50 వేల క్వింటాళ్ల ఉలవలు, 18,990 క్వింటాళ్ల అలసందలు, 12,500 క్వింటాళ్ల మొక్కజొన్న, 11,040 క్వింటాళ్ల పెసలు, 8,050 క్వింటాళ్ల జొన్నలు, 5,250 క్వింటాళ్ల కందులు, 2,512 క్వింటాళ్ల కొర్రలు, 2,350 క్వింటాళ్ల సజ్జలు, 1,250 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు, 562 క్వింటాళ్ల అనుములు అవసరమని నివేదించారు.

సేకరణ, సరఫరా బాధ్యతలు ఏపీ సీడ్స్‌కే
విత్తన సేకరణ, సరఫరా బాధ్యతలు ఏపీ సీడ్స్‌కు అప్పగించారు. ప్రస్తుతానికి టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా ఇంకా వాటి ధరలు, రాయితీ ఖరారు కావాల్సి ఉంది. అవి పూర్తయితే కానీ సేకరణ, సరఫరా, పంపిణీ కొలిక్కివచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇవన్నీ కావాలంటే ఎంతలేదన్నా వారం, పది రోజులు సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల వర్షాలు రావడంతో పంటలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నా విత్తనం లేక ఇబ్బంది పడుతున్నారు. కొందరు రైతులు బయట మార్కెట్‌లో అధిక ధరలు కొంటున్న పరిస్థితి నెలకొంది.

సకాలంలో విత్తనాలు అందేనా..?
వ్యవసాయశాఖ అధికారులు 90 శాతం రాయితీతో బయోమెట్రిక్‌ పద్ధతిలో ప్రత్యామ్నాయ విత్తనాలు ఇస్తామని చెబుతున్నారు. కాగా ఇప్పటికే ఏపీ సీడ్స్‌ వద్ద 600 క్వింటాళ్ల జొన్నలు, 500 క్వింటాళ్ల సజ్జ, 1,370 క్వింటాళ్ల కందులు, 90 వేల వరకు బహుధాన్యపు కిట్లు సిద్ధంగా ఉన్నా... ధరలు, రాయితీలు ఖరారు కాక పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చేసేలోగా వర్షాలు మొహం చాటేస్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement