జోష్ణవి విజయాలు స్ఫూర్తిదాయకం
-
శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు
నెల్లూరు(బృందావనం) : అంతర్జాతీయస్థాయి యోగా క్రీడాకారిణిగా నెల్లూరుకు చెందిన జోష్ణవి సాధిస్తున్న విజయాలు క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు అన్నారు. ఇటీవల వియత్నాంలో జరిగిన 6వ ఆసియా యోగాసన చాంపియన్‌షిప్ పోటీల్లో మూడు బంగారు, ఒక రజత పతకం సాధించిన జోష్ణవిని ఆదివారం నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలోని ఓ హోటల్‌లో సన్మానించారు. యోగా అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రవీంద్రబాబు హాజరై మాట్లాడుతూ జోష్ణవి త్వరలో అమెరికాలో జరిగే ప్రపంచస్థాయి యోగా పోటీల్లో పాల్గొనాల్సి ఉందన్నారు. కార్పొరేటర్ డాక్టర్ జెడ్.శివప్రసాద్ మాట్లాడుతూ జోష్ణవికి సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ద్వారా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి విన్నవించనున్నామన్నారు. రవీంద్రభారతి స్కూల్ కరస్పాండెంట్ రవీంద్రరెడ్డి, చిత్తూరు జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.నాయుడు, జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.ఎస్.సెల్వం పాల్గొన్నారు.
జాతీయస్థాయి క్రీడాకారులకు అభినందన
జాతీయస్థాయిలో వివిధ విభాగాల్లో పతకాలు సాధించిన నెల్లూరుకు చెందిన క్రీడాకారులు రాధాకృష్ణారెడ్డి, ఎ.శ్రీనివాసులు, రమణయ్య, కశిష్, ఎస్.లీనా తదితరులను అంతర్జాతీయ యోగా క్రీడాకారిణి జోష్ణవితోపాటు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ తరపున విజయకుమార్, వివిధ యోగా అసోసియేషన్‌లకు చెందిన యోగా గురువులు ఎం.రవీంద్ర, ఎమ్వీఎస్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.