* అడ్డుకున్న భర్త.. ప్రొఫెసర్ల వేధింపులే కారణం...
* ఈనెల 11 నుంచి ఆందోళనకు సిద్ధమైన దంపతులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఇంగ్లిష్ విభాగంలోని ఇద్దరు ప్రొఫెసర్లు వ్యవహరిస్తున్న తీరుతో మనోవేదనకు గురైన ఓ మహిళా స్కాలర్ తన ఇంట్లో బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నానికి యత్నించగా, ఆమె భర్త అడ్డుకున్నారు. ప్రొఫెసర్ల వైఖరికి నిరసనగా ఈనెల 11 నుంచి ఆందోళన చేయూలని నిర్ణయించుకున్నట్లు ఆ దంపతులు వెల్లడించారు. గురువారం కేయూలో పీహెచ్‌డీ పరిశోధకురాలు పైండ్ల జ్యోతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
క్యాంపస్‌లో ఇంగ్లిష్ విభాగంలో 2015 ఆగస్టులో ఆమె పీహెచ్‌డీ స్కాలర్‌గా ప్రవేశం పొందారు. జ్యోతి భర్త కిరణ్‌కుమార్ కూడా ఇంగ్లిష్ విభాగంలోనే ఎంఫిల్ చేస్తున్నారు. ఈ మేరకు ఆమె విభాగాధిపతి ప్రొఫెసర్ దామోదర్ వద్ద ఉన్న హాజరు పట్టికలో సంతకం చేయూల్సి ఉంటుంది. ముందు వెళ్తే తాను లేనప్పుడు ఎందుకు సంతకం చేశావని ప్రశ్నిస్తున్న ఆయన.. ఆలస్యంగా వెళ్తే ఇష్టమొచ్చినప్పుడు రావడమేమిటని అనుచితంగా వ్యవహరిస్తున్నారని జ్యోతి తెలిపారు.
అంతేకాకుండా దూరవిద్యలో చదువుకున్న నీకు ఎలా పీహెచ్‌డీలో సీటు వచ్చింది? అంటూ కులం పేరుతో తిట్టారని పేర్కొన్నారు. ఇంకా ఇటీవల ఇంగ్లిష్ విభాగంలో జరిగిన సదస్సుకు వెళ్తే బొమ్మలా వచ్చి వెళ్లిపోయావన్నారనీ, మహిళా పీజీ కళాశాలలో తరగతులు తీసుకుంటే క్లాసులెందుకు చెప్పావని ప్రశ్నించారని తెలిపారు. ఇదిలా ఉండగా ఇంగ్లిష్ విభాగంలో జ్యోతి బ్యాచ్ పీహెచ్‌డీ ప్రవేశాలపై ఒకరు కోర్టుకు వెళ్లగా అధికారులు అడ్మిషన్లు రద్దు చేసి మళ్లీ పలువురికి మెరిట్ కమ్ రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం ప్రవేశాలు కల్పించారు. దీంతో జ్యోతికి సైతం బీసీ-ఏ కేటగిరీలో పీహెచ్‌డీ సీటు వచ్చింది.
ఈనెల 15వ తేదీ వరకు ప్రవేశాలకు గడువు ఉండగా.. అడ్మిషన్ తీసుకునేందుకు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపస్‌లోని ఇంగ్లిష్ విభాగానికి జ్యోతి వెళ్లగా బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాస్ అనుచితంగా మాట్లాడారన్నారు. స్థానికురాలివై ఉండి ఆలస్యంగా రావడమేమిటని ప్రశ్నిస్తే తమ బంధువులు ఆస్పత్రిలో ఉండడంతో ఆలస్యమైందని చెప్పినట్లు తెలిపారు.
విభాగాధిపతి దామోదర్, డీన్ ప్రొఫెసర్ కె.పురుషోత్తంతోపాటు పరిశోధకుల ముందే శ్రీనివాస్ అనుచితంగా మాట్లాడడంతో ఆవేదన చెందిన తాను.. బుధవారం రాత్రి ఇంటికి వెళ్లాక వంటింట్లో గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే తన భర్త కిరణ్ కాపాడారని తెలిపారు. ఇద్దరు ప్రొఫెసర్లు తన పట్ల వ్యవహరిస్తున్న వైఖరిని గైడ్ ప్రొఫెసర్ లత దృష్టికి తీసుకెళ్లామనీ, ఈనెల 11వ తేదీ నుంచి ఇంగ్లిష్ విభాగం ఎదుట ఆందోళన చేయనున్నట్లు జ్యోతి, కిరణ్‌కుమార్ తెలిపారు.
మహిళా రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యాయత్నం
Published Fri, Jul 8 2016 4:40 AM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM
Advertisement
Advertisement