- అభ్యర్థులకు కొనసాగుతున్న దేహదారుఢ్య ఎంపికలు
ప్రశాంతంగా ఐదో రోజు పరీక్షలు
Published Sat, Dec 24 2016 11:03 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
కాకినాడ క్రైం :
పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా కాకినాడ పోలీసు పెరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు శనివారం ఐదో రోజుకు చేరుకున్నాయి. జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఆధ్వర్యంలో ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్‌మెంట్ పరీక్షలు జరిపారు. నాలుగో రోజు నిర్వహించిన పరీక్షల్లో 365 మంది అర్హత సాధించినట్టు ఎస్పీ తెలిపారు. ఐదో రోజు నిర్వహించిన పరీక్షల్లో 1,200 మంది హాజరు కావాల్సి ఉండగా, 1,036 మంది పాల్గొన్నట్టు చెప్పారు. కానిస్టేబుళ్ల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయని, ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహిస్తున్నట్టు వివరించారు. ప్రతిభ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. ఏఎస్పీ ఏఆర్ దామోదర్, ఓఎస్డీ వై.రవిశంకర్‌రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు పర్యవేక్షించారు.
అప్పీలుకు అవకాశం
దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా శారీరక పరీక్షల్లో (పీఎంటీ) పాల్గొని, అర్హత కోల్పోయిన అభ్యర్థులు అప్పీలు చేసుకునేందుకు పోలీసు నియామక మండలి అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్పీ రవిప్రకాష్
వెల్లడించారు. పీఎంటీలో పురుషులకు ఛాతి, ఎత్తు, మహిళలకు ఎత్తు, బరువులో ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఉదయం 6 నుంచి 12 గంటల్లోపు అప్పీలు చేసుకునేందుకు ఎస్పీని కలిసి అనుమతి తీసుకోవాలని కోరారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమైన, 24వ తేదీలో పాల్గొన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. అప్పీలుకు వచ్చే అభ్యర్థులు హాల్ టిక్కెట్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకురావాలని స్పష్టం చేశారు. అన్ని పత్రాలనూ గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాలని తెలిపారు.
Advertisement