నంద్యాల ఎన్జీఓ, నివర్తి కాలనీలో బార్ అనుమతిని రద్దు చేయాలంటూ వాగ్వాదానికి దిగిన బాధిత మహిళలు
- సి. బెళగల్ మండలం ఈర్లదిన్నె గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట ఇసుకను అమ్ముకుంటున్నారని, ఈ విషయమై తహసీల్దార్, ఎస్‌ఐకు తెలియజేసినా చర్యలు తీసుకోకుండా అక్రమార్కులకే కొమ్ము కాస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇదే గ్రామంలో 2009లో వరద ముంపుకు గురైన వారికి ఇళ్ల స్థలాల కోసం 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి కేటాయించారని, ఇంతవరకూ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేదని..న్యాయం చేయాలని కోరారు.
- తన పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించారని జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామానికి చెందిన దేవమ్మ.. జిల్లా కలెక్టర్ విజయమోహన్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని జూపాడుబంగ్లా తహసీల్దార్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సంవత్సరాలు గడిచిపోతున్నా తన సమస్య పరిష్కారం కావడం లేదని దేవమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.
- కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 216లోని ఐదు ఎకరాల్లో మామిడి పంటను సాగు చేశానని, పాత బ్యాటరీలను కాల్చి పొగను వెదజల్లడంతో తోట నాశనమైందని.. న్యాయం చేయాలని డీఆర్‌ఓకు రైతు బి.నాగలక్ష్మయ్య విన్నవించారు.
- మిడ్తూరు మండలం 49 బన్నూరులో రేషన్‌కార్డు నెంబర్ డబ్ల్యూఏపీ131600500173, డబ్ల్యూఏపీ 131600500306లకు వేలిముద్రలు పడడం లేదని, రేషన్ ఇవ్వడం లేదని, షేక్ మహబూబ్‌బాష, బి రామలక్ష్మమ్మ డీఆర్‌ఓకు ఫిర్యాదు చేశారు.
- పిహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్నామని, ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని 104 స్టాఫ్ వెంకటరమణ, రహిమాన్, అబ్దుల్లా, కిరణ్‌కుమార్, నాగేశ్వర్‌రెడ్డి, అభిమన్యుడు మొరపెట్టుకున్నారు.
- పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలోని సర్వే నెంబర్ 201లోని ప్రభుత్వానికి సంబంధించిన 8.92 సెంట్ల భూమిని 24.84 సెంట్ల భూమిగా మార్పు చేసి స్థానిక ఆంధ్రబ్యాంకులో రుణాలు తీసుకుని ప్రభుత్వాన్ని మోసం చేశారని బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆ గ్రామ నివాసి బి.శివశంకర్ ఫిర్యాదు చేశారు.