
కడప ఉక్కు కోసం ఉద్యమిద్దాం
కడప సెవెన్‌రోడ్స్:
ప్రభుత్వాల మెడలు వంచి కడపలో ఉక్కు పరిశ్రమను సాధించుకోవడానికి ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. కడపలో స్టీల్ ప్లాంటు నిర్మించాలని విభజనచట్టంలో పేర్కొన్నా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. అంతర్జాతీయంగా ఉక్కు ధరలు తగ్గడాన్ని సాకుగా చూపెడుతూ ఆ పరిశ్రమలు ఏర్పాటు లాభదాయకం కాదని కేంద్రం మాట్లాడటం తగదన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి కరువు ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. రాయలసీమకు రూ. 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించి మూడేళ్లలో పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు కోరారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం 854 అడుగులు నిల్వ చేయాలన్నారు. జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వివక్షపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేసీ ఆయకట్టు స్థిరీకరణకు రాజోలి, జొలదరాశి రిజర్వాయర్లను నిర్మించాలన్నారు. ఖరీఫ్‌లో వేరుశనగను నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వాలని, రబీలో ఉచితంగా ఎరువులు, విత్తనాలు ఇవ్వాలని, రుణాలు రీషెడ్యూల్డ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చంద్రశేఖర్, ఎ.రామ్మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్, ఓ.శివశంకర్, సావంత్ సుధాకర్, పాపిరెడ్డి, దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.