పీఠం కోసం.. | fight for mayer seat | Sakshi
Sakshi News home page

పీఠం కోసం..

Published Sun, Mar 13 2016 3:42 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

పీఠం కోసం..

పీఠం కోసం..

మేయర్ పదవి దక్కించుకునేందుకు ముమ్మర యత్నాలు
రేసులో ముందున్న నన్నపనేని, గుండా ప్రకాశ్
డిప్యూటీ మేయర్ పరిశీలనలో జోరిక, బోడ డిన్న
కీలక నేతల వద్దకు ఆశావహుల పరుగులు

 సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మేయర్ ఎన్నికకు సమయం దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో ఈ కీలక ప్రక్రియ పూర్తి కానుంది. వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ విజయం సాధించింది. కార్పొరేషన్‌లోని 58 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్ 44 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచిన ఎనిమిది మంది కూడా అధికార పార్టీలోనే చేరే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌కు తిరుగులేని మెజారిటీ  ఉండడంతో మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కార్పొరేటర్లుగా గెలిచిన పలువురు ముఖ్య నేతలు ఈ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లో మకాం వేసి పార్టీ కీలక నేతలను కలిసి తమ కోరికను చెప్పుకుంటున్నారు. అధినేత కేసీఆర్ ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. గులాబీ పార్టీ ముఖ్య నేతలు టి.హరీశ్‌రావు, కె.టి.రామారావు, కల్వకుంట్ల కవిత వద్దకు వెళ్లి మేయర్ పదవి వచ్చేలా తమకు సహకరించాలని కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎమ్మెల్యేలు డి.వినయభాస్కర్, కొండా సురేఖ, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్యతోపాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలుస్తున్నారు.

 వివరాలు సేకరిస్తున్న అధిష్టానం..
మేయర్ పదవి ఎవరికి అప్పగించాలనే విషయంపై టీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది. పదవిని ఆశిస్తున్న కీలక నేతల  వివరాలను సేకరిస్తోంది. అధికార పార్టీ కావడంతో అన్ని రకాలుగా సమాచారం తీసుకుంటోంది. ఇంటెలిజెన్స్ నివేదికలను కూడా పరిశీలిస్తోంది. 19వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన నన్నపునేని నరేందర్ పేరును మేయర్ పదవికి టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రధానంగా పరిశీలిస్తోంది. గ్రేటర్ వరంగల్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా, ఆర్టీసీ టీఎంయూ వరంగల్ రీజియన్ గౌరవాధ్యక్షుడిగా కీలకంగా పని చేసిన నేపథ్యం ఆయనకు అనుకూలిస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ చివరి నిమిషయంలో చేజారడం నరేందర్‌కు కలిసివచ్చే మరో అంశంగా ఉంది. కాగా, అధిష్టానం పరిశీలనలో  26వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన గుండా ప్రకాశ్‌రావు కూడా ఉన్నారు.

గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి జనరల్ కేటగిరికి కేటాయించినందున గుండా ప్రకాశ్‌రావుకు అవకాశం ఇవ్వాలని ఆర్యవైశ్య మహాసభ కోరుతోంది. ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నేతృత్వంలో పలువురు సంఘం ముఖ్యులు గుండా ప్రకాశ్‌కు మేయర్ పదవి కోసం టీఆర్‌ఎస్ అధిష్టానం వద్ద ప్రయత్నిస్తున్నారు. 37వ డివిజన్ కార్పొరేటర్ కోరబోయిన సాంబయ్య పేరును మేయర్ పదవి కోసం పరిశీలించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అధిష్టానాన్ని కోరుతున్నారు. 27వ డివిజన్ కార్పొరేటర్ వద్దిరాజు గణేష్ సైతం మేయర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. వద్దిరాజు గణేష్‌కు ఇప్పటికీ టీఆర్‌ఎస్ సభ్యత్వం లేకపోవడం పదవి విషయంలో అడ్డంకిగా మారుతోంది.

 ‘డిప్యూటీ’పై పలువురి కన్ను..
మేయర్ పదవి సీనియర్ నేతలకు దక్కనున్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎక్కువ మంది నేతలు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ తరహాలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన వారికి ఈ పదవి ఇవ్వవచ్చనే అభిప్రాయం టీఆర్‌ఎస్‌లో వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పాల్గొన్న 30వ డివిజన్ కార్పొరేటర్ బోడ డిన్న, 34వ డివిజన్ కార్పొరేటర్ జోరిక రమేశ్, 41వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ ఖాజా సిరాజొద్దిన్, 36వ డివిజన్ కార్పొరేటర్ అబూబక్కర్, 6వ డివిజన్ నుంచి గెలుపొందిన చింతల యాదగిరి పేర్లను టీఆర్‌ఎస్ అధిష్టానం డిప్యూటీ మేయర్ పదవి కోసం పరిశీలిస్తోంది. ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు, పార్టీలో క్రీయాశీలకంగా పని చేయని వారు సైతం ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నా టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement