ప్రత్యేక హోదా కోసం పోరాడండి
రాజధాని జపం మాని ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు ఎల్‌ఎం మోహన్ రెడ్డి సూచించారు. డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురంలో రైతువిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌని ఉపేంద్రరెడ్డితో కలిసి వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
డీ.హీరేహాళ్ : రాజధాని జపం మాని ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు ఎల్‌ఎం మోహన్ రెడ్డి సూచించారు. డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురంలో రైతువిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌని ఉపేంద్రరెడ్డితో కలిసి వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులో అన్ని పక్షాలూ ఏకమై జల్లికట్టును సాధించుకున్నాయని, ఇదే స్ఫూర్తిలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిసి అప్పట్లో 15 ఏళ్లు హోదా కావాలని చంద్రబాబు అడిగారన్నారు. నేడు ‘ఓటుకు నోటు’ కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలు వీడి భవిష్యత్ తరాల కోసమైనా హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. కరువు కోరల్లో చిక్కుకున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులను ‘చంద్రన్న బాట’ పేరుతో మళ్ళించి దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.