గండికోట హోదాపై కదలిక
కడప కల్చరల్:
గండికోటకు ప్రపంచ వారసత్వ హోదా అంశంపై ప్రస్తుతం ప్రధాని కార్యాలయం జనరల్ విభాగంలో ఉన్న ఫైలుకు కదలిక వచ్చింది. ఈనెల 2వ తేదిన ప్రధాని కార్యాలయం నుంచి సంబంధిత అధికారులు కేంద్ర సాంస్కృతికశాఖ కార్యాలయానికి పంపారు. ఈ విషయంగా వీలైనంత త్వరలో తగిన నిర్ణయం తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫైలు పంపిన అమరావతి అభివృద్ధిసాధికార సంస్థ చైర్మన్ జాస్తి వీరాంజనేయులకు సమాచారం అందజేశారు.
పూర్వాపరాలు
ప్రపంచంలోనే అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తర్వాత అంతటి ప్రాధాన్యతగల అద్భుత ప్రాంతంగా గండికోటకు పేరుంది. కానీ ఇంతవరకు అధికారులెవరూ దీని అభివృద్ధికి తగిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇటీవల పొరుగున ఉన్న లేపాక్షి క్షేత్రానికి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు తెచ్చేందుకు హిందూపురం శాసనసభ్యులు, సినీహీరో బాలకృష్ణ యత్నాలు ప్రారంభించారు. కానీ మన జిల్లాలో అంతకుమించిన గొప్ప పర్యాటక ప్రాంతం ఉన్నా దీని గురించి అధికార పార్టీకి సంబంధించిన వారెవరూ పట్టించుకోకపోవడంపై పర్యాటకాభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటక అభిమానుల ఆవేదనను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి అమరావతి సాధికారక సంస్థ చైర్మన్ జాస్తి రామాంజనేయులు గండికోటకు ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలని ప్రధానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. దాంతోపాటు రాష్ట్రంలోని మరో నాలుగు పర్యాటక ప్రాంతాలకు కూడా ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలని ఈ లేఖలో రాశారు.
కదలిక
సెప్టెంబరు 21న తమ కార్యాలయానికి చేరిన జాస్తి వీరాంజనేయులు లేఖను ఈనెల 2న కేంద్ర సాంస్కృతిక శాఖకు పంపామని ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు వీరాంజనేయులకు తెలిపారు. ప్రపంచానికే గర్వకారణంగా నిలిచిన గండికోటను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు ప్రథమ ప్రాధాన్యతగా భావించి చర్యలు చేపట్టాలని వీరాంజనేయులు మళ్లీ లేఖ రాశారు. స్పందించిన అధికారులు బుధవారం ఢిల్లీలోని కేంద్ర పురావస్తుశాఖ కార్యాలయంలో ఆ శాఖ డైరెక్టర్ లూర్దురాజు ఆధ్వర్యంలో ఆ శాఖ ప్రపంచ వారసత్వ హోదా విభాగం అధికారి శర్మతో కలిసి గండికోటతోపాటు రాష్ట్రంలోని ఇతర నాలుగు పర్యాటక ప్రాంతాలకు వారసత్వ హోదా ఇచ్చే అంశంపై చర్చించినట్లు సమాచారం. మొదటి ప్రాధాన్యతగా గండికోటను పరిశీలించాలని, త్వరలో కేంద్ర పురావస్తుశాఖ, ఇతర అధికారులు గండికోటను పరిశీలించి ఫోటోలు, డాక్యుమెంటరీ, చరిత్ర, ఇతర అంశాలను సేకరించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
హోదాతో ప్రయోజనం?
గండికోట లేదా ఏదైనా ఓ పర్యాటక ప్రదేశానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కితే కేంద్రం విడుదల చేసే నిధులతోపాటు ప్రతి ఏడాది యునెస్కో కూడా భారీగా నిధులు విడుదల చేస్తుంది. యునెస్కోలో సభ్యత్వం గల అన్ని దేశాల నుంచి ఆ ప్రదేశానికి పర్యాటకులు వచ్చేలా ఏర్పాటు చేస్తుంది. దాదాపు సంవత్సరమంతా విదేశీ పర్యాటకులు ఈ క్షేత్రాన్ని దర్శించేలా చర్యలు తీసుకుంటుంది. యునెస్కో ఇచ్చే నిధులతో కేవలం గండికోట ప్రాంతమే కాకుండా పర్యాటక సర్క్యూట్ ఏర్పడి జిల్లాలోని ఇతర పర్యాటక ప్రాంతాలలో కూడా పర్యాలకుల సందడి పెరుగుతుంది. దాంతో జిల్లాకు ఆర్థికంగా కూడా లాభం చేకూరే అవకాశాలు ఉంటాయి.