చెరువు నింపండి
- ∙మీ కోసంలో కోనాపురం గ్రామస్తుల వినతి
అనంతపురం అర్బన్ : ‘సార్ మా గ్రామానికి సంబంధించిన గుండేవని చెరువు కాలువ కంటే ఎత్తులో ఉంది. దీంతో కాలువ నీరు చేరువులోకి చేరదు. ఎత్తిపోతల ద్వారా చెరువుని నింపి ఆదుకోండి.’ అంటూ జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతంకు కనగానిపల్లి మండలం కోనాపురం గ్రామస్తులు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని నిర్వహించిన మీ కోసంలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి, జడ్పీ సీఈఓ రామచంద్ర అర్జీలు స్వీకరించారు. కోనాపురం గ్రామస్తులు ఇంటూరి పరంధామరెడ్డి, పత్తిపాటి రామాంజినేయులు, గిరిశపు హనుమంతు, నారా శ్రీరాములు, తదితరులు అర్జీ ఇచ్చి తమ సమస్యను తెలిపారు. కనగానపల్లి, రాంపురం, కోనాపురం, కుర్లపల్లి, బోలేపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. గుండేవని చెరువుకి నీరు ఇస్తే భూగర్భ జల మట్టం పెరిగి పై గ్రామాల్లో బోర్లకు నీరు వస్తుందని తెలిపారు.
రైతులను ఆదుకోవాలి..
జిల్లాలో 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినిందని, రైతులకు ఎకరాకు రూ.20 వేలు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రామాంజి, తదితరులు విన్నవించారు.
ఏజెన్సీ కొనసాగించండి
మధ్యాహ్న భోజన ఏజెన్సీ ద్వారా కుటుంబం గడుస్తోంది. ఏజెన్సీని తొలగించడంతో ఇబ్బంది పడుతున్నాము. కనికరించి ఏజెన్సీ కొనసాగించే ఆదేశాలిచ్చి ఆదుకోవాలని ఎండీఎం ఏజెన్సీ నిర్వాహకురాలు జె.రమణమ్మ విన్నవించుకుంది.