అగ్ని ప్రమాద నివారణ చర్యలు తప్పనిసరి
Published Sat, Oct 22 2016 6:42 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
ఏలూరు అర్బన్ ః
అగ్నిప్రమాదాల నివారణకు అందరూ సహకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి బి. వీరభధ్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల ఒడిషాలోని ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎందరో రోగులు ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ టిఏ. త్రిపాఠి జిల్లాలో అన్ని వ్యాపారసముదాయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, బహుళ అంతస్థుల భవనాలు, అపార్ట్‌మెంట్‌లు, కాలేజీలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారన్నారు. ఆ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రాథమిక తనిఖీలలో మూడు హోటళ్ళు, 14 ఆసుపత్రులు, 5 షాపింగ్ మాల్స్, 9 సినిమా హాళ్ళలో అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించడం లేదని గుర్తించామన్నారు. వారికి ఇప్పటికే నోటీసులు పంపామన్నారు. ఈ క్రమంలో జిల్లాలో మరింత విసు్త్రతంగా తనిఖీలు నిర్విహిస్తామని తెలిపారు. కాబట్టి ఇప్పటి వరకూ తమ శాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందని భవనాల యజమానులు తక్షణం స్పందించి శాఖ నిబంధనలు పూర్తిగా అమలు చేయాలని కోరారు. అలా చేయని వారి భవనాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement