ఫ్రూట్స్ కోల్ట్ స్టోరేజీ సెంటర్‌లో అగ్ని ప్రమాదం
Published Thu, Sep 1 2016 11:36 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
కోల్‌సిటీ : గోదావరిఖనిలోని ఓ ఫ్రూట్స్ కోల్డ్ స్టోరేజ్ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గంగానగర్‌లోని లారీల మెకానిక్ షెడ్ ప్రాంతంలో కొంతకాలంగా తాజ్ ఫ్రూట్స్ కోల్డ్‌స్టోరేజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ అరటిపండ్లు పండిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సెంటర్ నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది నీళ్లు చల్లి మంటలు ఆర్పేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఆస్కారం లేదని, విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ఇటీవల కేంద్రానికి విద్యుత్ విభాగం అధికారులు పవర్ కట్ చేశారని స్టోరేజ్ సెంటర్ మేనేజర్ మోహిద్ వెల్లడించాడు. కేంద్రంలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి మంటలు ఎక్కువగా వ్యాపించాయని ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ మహిపాల్ తెలిపారు. సకాలంలో చేరుకోకుంటే భారీ ప్రమాదం జరిగేదని పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించి ఉంటారని కేంద్రం నిర్వాహకులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో రూ.లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని యజమాని తాజొద్దీన్ తెలిపారు. వాస్తవ నష్టంపై అంచనా వేస్తున్నామని ఫైర్ అధికారులు వెల్లడించారు.
Advertisement