టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం
Published Sun, Jul 17 2016 10:10 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
గుంతకల్లు టౌన్ : అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం మహేంద్ర స్ట్రీట్‌లోని ఇస్మాయిల్ టింబర్ డిపోలో ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డీపో నుంచి దట్టమైన పొగ, ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నిద్రావస్థలో ఉన డిపో చుట్టుపక్కల వారు ఉలిక్కిపడిలేచి ఆందోళనతో ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న టింబర్ డిపో యజమాని పరుగులతో వచ్చి స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు యత్నించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఆఫీసర్ యోగేశ్వరరెడ్డి, సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. డిపోలో భారీ స్థాయిలో కలప తగలబడడంతో మంటలను ఆర్పిందుకు మరో ఫైరింజన్‌ను రప్పించారు. ఉదయం 11 గంటలకు మంటలు అదుపులోనికి వచ్చాయి. విద్యుత్ షార్ట్‌సర్కుట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు తెలిపారు. డిపోలో నిల్వ ఉంచిన 2 వేల చదరపు అడుగుల కట్‌సైజ్ బలాసా టేకు, వెయ్యి చదరపు అడుగుల మత్తి కట్టెలు కాలిబూడిదయ్యాయని వాపోయాడు. సుమారు రూ.40 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని కంటనీరు పెట్టుకున్నారు.
Advertisement
Advertisement