జీజీహెచ్లో తొలి గుండెమార్పిడి ఆపరేషన్ సక్సెస్ | First heart transplant being performed in GGH, Guntur | Sakshi
Sakshi News home page

జీజీహెచ్లో తొలి గుండెమార్పిడి ఆపరేషన్ సక్సెస్

Published Fri, May 20 2016 7:44 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

First heart transplant being performed in GGH, Guntur

గుంటూరు: నవ్యాంధ్రప్రదేశ్‌లో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు దేశంలోని నాలుగు ప్రభుత్వాస్పత్రుల్లో ఈ తరహా శస్త్రచికిత్సలు జరుగుతుండగా.. ఐదో ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినప్పటికీ దాతల సహకారం, సొంత ఖర్చులతో ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే శుక్రవారం గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు గుండె మార్పిడి శస్త్రచికిత్స ప్రారంభించి సాయంత్రం 4.30 గంటలకు ముగించారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం, భరద్వాజ్, శ్రీనివాస్, షరీఫ్, అనూష పాల్గొన్నారు.

గుండెను సేకరించిన వైనం.. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఇమడాబత్తుని ఏడుకొండలు(44) ఈ నెల 13న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 19న ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇదే సమయంలో గుంటూరు నగర శివారులోని స్వర్ణభారతినగర్‌కు చెందిన ఉప్పు ఏడుకొండలు జీజీహెచ్‌లో ఆరు నెలలుగా గుండె జబ్బుతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. గుండె పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో గుండె మార్పిడి చేయాలని డాక్టర్ గోఖలే నిర్ణయించారు. గుండె దాతల కోసం ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన ఇమడాబత్తుని ఏడుకొండలు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దాత, స్వీకర్తల బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అవడంతో గుండెను గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఉప్పు ఏడుకొండలుకు అమర్చాలని నిర్ణయించారు.

ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో బ్రెయిన్‌డెడ్ అయిన ఇమడాబత్తుని ఏడుకొండలుకు శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకూ శస్త్రచికిత్స చేసి గుండెను సేకరించారు. గుండె తరలింపునకు ప్రత్యేక అనుమతులు గుండెను ఎలాంటి ఇబ్బందులు లేకుండా 15 నిమిషాల్లో గుంటూరు జీజీహెచ్‌కు తరలించేందుకు సహకరించాలంటూ వైద్యులు గుంటూరు ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కోరారు.

స్పందించిన ఆయన శుక్రవారం ఉదయం నుంచి మంగళగిరి- గుంటూరు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గ్రీన్‌చానల్ ఏర్పాటు చేశారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే విజయవాడ - చెన్నై జాతీయ రహదారి ఉదయం 11 గంటల నుంచి ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది. సరిగ్గా 11.04 గంటలకు మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నుంచి బయలుదేరి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు జీజీహెచ్‌కు కేవలం 14 నిముషాల్లో గుండెను తీసుకొచ్చారు. ఆంబులెన్సులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన థర్మాకోల్ ఐస్‌బాక్స్‌లో గుండెను భద్రపరిచారు.

గుండెను సురక్షితంగా చేర్చడంలో అర్బన్ ఏఎస్పీలు భాస్కరరావు, సుబ్బరాయుడు, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీనివాసులు, ఈస్ట్ డీఎస్పీ సంతోష్, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ గురుస్వామి, సీఐలు వెంకన్న చౌదరి, సురేష్‌బాబు, వేమారెడ్డి సుమారు వంద మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement