భూసేకరణకు మొదటి ప్రాధాన్యం | first priority for land acquisition | Sakshi
Sakshi News home page

భూసేకరణకు మొదటి ప్రాధాన్యం

Published Wed, May 10 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

భూసేకరణకు మొదటి ప్రాధాన్యం

భూసేకరణకు మొదటి ప్రాధాన్యం

- ప్రజాపంపిణీని గాడిలో పెడతాం
- ఈ ఆఫీసులపై ప్రత్యేక దృష్టి
- బాధ్యతలు స్వీకరించిన నూతన జేసీ
- మొదటి రోజు అధికారులను
  పరుగు పెట్టించిన ప్రసన్న వెంకటేష్‌
- బి.తాండ్రపాడులో చౌకదుకాణం తనిఖీ
- ఓర్వకల్లులో విమానాశ్రయం భూముల పరిశీలన
- కలెక్టరేట్‌లో కలియ తిరిగి వివరాల సేకరణ
 
కర్నూలు(అగ్రికల్చర్‌): భూసేకరణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నూతన జేసీ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. ప్రజాపంపిణీని గాడిలో పెడతానని,  ఈ– ఆఫీసులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వివరించారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన పాలనపై దృష్టి పెట్టారు. తనకు ఏఏ వివరాలు కావాలనే దానిపై ఆదేశాలు జారీ చేస్తూనే.. క్షేత్ర స్థాయి తనిఖీలతో అధికారులను పరుగు పెట్టించారు. 
 
బాధ్యతల స్వీకరణ..
కాకినాడ పోర్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రసన్న వెంకటేష్‌ను ఇటీవల ప్రభుత్వం కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు బుధవారం ఉదయం 10.20 గంటలకు జేసీగా ఆయన బాధ్యతలు  స్వీకరించారు. ముందుగా సప్తగిరి నగర్‌లో మణికంఠ అయ్యాప్ప స్వామి ఆలయానికి వెళ్లి ఆయన పూజలు జరిపారు.  బాధ్యతలు స్వీకరించిన జేసీకి డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, డీఎస్‌ఓ సుబ్రమణ్యం, కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, ఏఎస్‌ఓ రాజారఘువీర్, కలెక్టర్‌ కార్యాలయ సూపరిటెండెంట్లు బోకేలు ఇచ్చి అభినందనలు తెలిపారు. 
 
పిన్న వయస్కుడు..
 తమిళనాడులోని కడళూరు జిల్లా తిరుచ్చి గ్రామానికి చెందిన ప్రసన్న వెంకటేష్‌.. 2012 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్‌ అధికారి. అగ్రికల్చర్‌ బీఎస్సీతో పాటు ఎంబీఏలో బ్యాంకింగ్‌ పైనాన్స్‌ కోర్సును పూర్తి చేశారు. ఐఏఎస్‌ పూర్తి అయిన తర్వాత ఏడాది పాటు అసిస్టెంట్‌ కలెక్టర్‌గా వైఎస్‌ఆర్‌ జిల్లాలో శిక్షణ పొందారు. మొదట పాడేరు సబ్‌ కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్‌ లభించింది. తర్వాత సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అనంతరం పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పనిచేశారు. అక్కడి నుంచి కాకినాడ పోర్టు డైరెక్టర్‌గా వెళ్లారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా జేసీగా వచ్చారు. ఇంతవరకు జేసీలుగా పనిచేసిన వారిలో ఈయన పిన్న వయస్కుడు కావడం విశేషం.   
 
ఆదేశాల మీద ఆదేశాలు..
బాధ్యతలు తీసుకున్న తరువాత జేసీ.. పట్టుమని 10 నిముషాలు కూడ ఉండలేదు. ఆ లోపే రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని మీసేవ కేంద్రాలు, సినిమా థియేటర్ల వివరాలు, అన్ని మండలాల తహసీల్దార్ల వివరాలు తక్షణం ఇవ్వాలని ఆదేశించారు. పౌరసరఫరాలకు సంబంధించి ఈ పాస్‌ మిషన్‌లతో నడుస్తున్నవి, ఆఫ్‌లైన్‌తో నడుస్తున్నవి, ప్రజా పంపిణీలోని ఇబ్బందుల వివరాలు తక్షణం ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌కు వెళ్లి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణలకు బొకేలు సమర్పించి మర్యాద పూర్వకంగా కలిశారు.
 
చౌకదుకాణం తనిఖీ 
బాధ్యతలు తీసుకున్న వెంటనే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. కర్నూలు మండలం బి.తాండ్రపాడులోని షాపు నెంబరు–2 ను తనిఖీ చేశారు. ఈ–పాస్‌ మిషన్‌ ద్వారా రేషన్‌ పంపిణీలోని ఇబ్బందులు, ఇప్పటివరకు ఎన్ని కార్డులకు సరుకులు పంపిణీ చేశారనే దానిని తెలుసుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడారు. సరుకులు సక్రమంగా అందుతున్నాయా.. ప్రజా పంపిణీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరుకులు సక్రమంగా పంపిణీ అవుతున్నాయని గ్రామస్తులు జేసీకి వివరించారు.
 
ఓర్వకల్‌ విమానాశ్రయం, సోలార్‌ పార్క్‌ భూముల పరిశీలన...
తాండ్రపాడు నుంచి ఓర్వకల్లు మండలానికి వెళ్లారు. విమానాశ్రయం, సోలార్‌ పార్క్‌కు కేటాయించిన భూములను పరిశీలించారు. ఓర్వకల్లు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి విమానాశ్రయం, సోలార్‌ పార్క్‌లకు భూముల సమీకరణను అడిగి తెలుసుకున్నారు. భూముల సమీకరణలో ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మ్యాప్‌లను పరిశీలించారు. ఎంత మంది రైతులకు పరిహారం ఇచ్చారు... ఇంకా ఎంత మందికి ఇవ్వాల్సి ఉందనే వివరాలు ఆరా తీశారు. 
 
కలెక్టరేట్‌ మొత్తం కలియ తిరిగి..
సాయంత్రం కలెక్టరేట్‌ మొత్తాన్ని కలియ తిరిగారు. ట్రెజరీ, భూమి రికార్డులు, సర్వే కార్యాలయం, పశుసంవర్ధకశాఖ, వ్యవసాయశాఖ, డీఆర్‌డీఏ, డ్వామా కార్యాలయాలను జేసీ పరిశీలించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సెక‌్షన్లను పరిశీలించారు. ఆయా శాఖల వివరాలు తెలుసుకున్నారు. అరగంటకు పైగా కలెక్టరేట్‌లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓలు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రజా పంపిణీపై సమీక్ష నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement