- లక్ష్యసాధనలో కడెం సిబ్బంది
- కడెం కేంద్రంలో సమస్యల తిష్ట
ఆరు కోట్ల చేప పిల్లల ఉత్పత్తే లక్ష్యం
Published Sun, Jul 17 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
కడెం : కడెంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో శనివారం నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. కేంద్రంలో వివిధ రకాల చేప పిల్లలను ఉత్పత్తి చేసి వాటిని ఫారం పరిధిలోని మత్స్యకార్మిక సంఘాలకు పంపిణీ చేస్తారు. ఏటా ప్రభుత్వం కేంద్రానికి చేప పిల్లల ఉత్పత్తికోసం ఒక లక్ష్యాన్ని ప్రకటిస్తుంది. ఈసారి ఆరు కోట్ల పిల్లల ఉత్పత్తి లక్ష్యం కాగా సిబ్బంది ఆ దిశగా కషి చేస్తున్నారు. కేంద్రంలో పిల్లల ఉత్పత్తికి అవసరమైన 46 హౌజ్‌లుండగా పలు సమస్యలూ ఉన్నాయి.
జలాశయంలోకి నీరు రావడంతో..
కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షాలకు కడెం ప్రాజెక్టు జలాశయంలోకి నీరు పెద్ద మొత్తంలో రావడంతో అధికారులు ఉత్పత్తి ప్రారంభించారు. మొదట మిరుగాల, రహు, బొచ్చ రకం చేపల ఉత్పత్తి చేపట్టారు. తల్లి చేపకు ఇంజక్షన్ల ద్వారా గర్భం వచ్చేలా చేసి మగ చేపలతో వాటిని ఫలదీకరణ చేయిస్తారు. ఈ ప్రక్రియను స్వయంగా అధికారులే చేపడతారు. ఇలా ఫారంలోని హాచరీలో ఆ గుడ్డును వేసి రెండు రోజుల వరకు నీటితో సర్క్యులేషన్ చేయగా దాని నుంచి పిల్లలు విడుదలవుతాయి.
ఇలా ఆ చిరుచేప పిల్లలను ఉత్పత్తి చేయగా వాటిని 45రోజుల వరకు నర్సరీలో వాటికి అవసరమైన పల్లిపిండి, తౌడు తదితర ఆహారం వేస్తూ జాగ్రత్తగా పెంచుతారు. 45రోజుల తర్వాత అవి ఒక ఇంచు సైజులో పెరుగుతాయి. అపుడు వాటిని జిల్లాలోని గుర్తింపుగల 264 మత్స్యకార సంఘాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయిస్తారు.
అధికారుల పర్యవేక్షణలో..
హౌజుల్లో వేసిన పిల్లలకు ఆహారాన్ని ప్రత్యేకంగా తయారు చేసి సిబ్బంది రోజూ వేస్తారు. పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తుంటారు. కడెం ప్రాజెక్టు జలాశయంలో కూడా వర్షాకాల సీజన్ తర్వాత ఆ పిల్లలను వదులుతారు. ప్రస్తుతం తల్లి చేపలు పిండోత్పత్తి దశలో ఉన్నాయి. దీంతో ఆ జాతి చేపలు నశిస్తాయన్న కారణంతో మత్స్య కార్మికులను ఈ సమయంలో చేపల వేటకు అనుమతించరు.
ఈ సారి 6కోట్ల పిల్లల ఉత్పత్తి లక్ష్యం ఉండడంతో లక్ష్య సాధన దిశగా అంతా కషి చేస్తున్నారు. అంతేగాక దోమల నివారణ కోసం ప్రస్తుతం కేంద్రంలో 4 లక్షల గంబూజియా చేపలున్నాయి. మురికికాల్వల్లో నీటి గుంతల్లో నిల్వ ఉండే దోమ లార్వాను ఈ చేప పిల్లలు చంపేస్తాయి. వాటిని ఆయా పంచాయతీలకు ఉచితంగా సరఫరా చేస్తారు.
కేంద్రంలోని సమస్యలు
కేంద్రంలో సమస్యలు తిష్ట వేశాయి. సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు. ఉన్న కొద్ది మంది కేంద్రంలో కాకుండా బయట ఉంటున్నారు. సిబ్బంది కోసం దశాబ్దాల క్రితం నిర్మించిన గదులు శిథిలావస్థకు చేరాయి. నాలుగైదేళ్లుగా కేంద్రానికి ఇన్‌చార్జి అధికారే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం చుట్టూ కంచె లేదు. పశువులు విచ్చల విడిగా సంచరిస్తుంటాయి. కేంద్రం ప్రాంగణం అంతా గుంతలుగా ఉంది. చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతోంది. ఫారం అంతా సిమెంట్‌తో ఫ్లోరింగు, కేంద్రంలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
లక్ష్యాన్ని సాధిస్తాం
కేంద్రం నిర్వహణకు రూ.6లక్షలు మంజూరు కాగా చేప పిల్లల ఉత్పత్తిని ప్రారంభించాం. లక్ష్యాన్ని సాధించేందుకు కషి చేస్తున్నాం. సిబ్బంది సరిపడా లేరు. భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదించాం. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించాం. కేంద్రాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. గంబూషియా చేప పిల్లలు ఉచితంగా అందజేస్తాం.
Advertisement
Advertisement