భావదేవరపల్లిలో మత్స్య పరిశోధన కేంద్రం
భావదేవరపల్లిలో మత్స్య పరిశోధన కేంద్రం
Published Thu, Aug 4 2016 9:00 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
భావదేవరపల్లి (నాగాయలంక) : గ్రామంలో మత్స్య పరిశోధన, ఉప్పు నీటì æపరిశోధన కేంద్రాల ఏర్పాటుకు ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటుంటామని రాష్ట్రవ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. స్థానిక శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం–మండలి వెంకట కృష్ణారావు ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో రూ.81 లక్షలతో నిర్మించిన రైతుశిక్షణ కేంద్రం, విశ్రాంతి గదుల భవనాలను శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలసి మంత్రి ప్రత్తిపాటి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తోందన్నారు. చేపల వేట విరామ కాలంలో ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయం అందలేదని పలువురు మత్య్స్యకారులు ఆందోళన వ్యక్తం చేయడంతో, పుష్కరాలు ముగిసిన వెంటనే ఉన్నతాధికారులను పిలిపించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని, విద్యార్థుల సీట్లసంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి పేర్కొన్నారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మత్య, ఉప్పునీటి పరిశోధన కేంద్రాల ఆవశ్యకతను వివరించారు. ఫిషరీస్ కాలేజీ, రైతుశిక్షణ æకేంద్రాలు దివిసీమ మానసపుత్రికలుగా అభివర్ణించారు.
ఉప్పునీటి చేపల ప్రదర్శన
నాగాయలంక కేజ్‌కల్చర్ శాస్త్రవేత్త తలశిల రఘుశేఖర్, విద్యార్థులతో కలసి ఏర్పాటు చేసిన 15 రకాల ఉప్పునీటి చేపల ప్రదర్శనను మంత్రి ప్రత్తిపాటి తిలకించారు. కళాశాల ప్రాంగణంలోని చెరువులలో వనామి జాతి రొయ్యపిల్లలు, రాగండి చేపపిల్లలను మంత్రి, ఉపసభాపతి వదిలారు. బాలబాలికల వసతిగృహాల మొదటి అంతస్తుకు శంకుస్థాపన కూడా చేశారు. ఎస్‌వీవీయూ ఫిషరీస్‌సైన్స్ డీన్ టి.వి.రమణ, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, సర్పంచ్ మండలి బేబీసరోజినీ, ఎంపీటీసీ సభ్యులు బొండాడ గణపతిరావు, తలశిల స్వర్ణలత, నీటిసంఘం అధ్యక్షుడు మండలి ఉదయభాస్కర్, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.వీరభద్రరావు పాల్గొన్నారు.
Advertisement