విషాదంతో ఆరంభం | five died in new year celebrations | Sakshi
Sakshi News home page

విషాదంతో ఆరంభం

Published Sun, Jan 1 2017 11:25 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

విషాదంతో ఆరంభం - Sakshi

విషాదంతో ఆరంభం

నూతన సంవత్సరం జిల్లాలో విషాదంతో ఆరంభమైంది. న్యూ ఇయర్‌ వేడుకల్లో పాల్గొని సందడి చేసిన యువకులు ఇంటికి వెళ్లే సమయంలో రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. రాయదుర్గం పట్టణంలోని పైతోటకాలనీ వద్ద రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇక హిందూపురం మండలం సంతేబిదనూరు గేటు సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో చౌళుకు చెందిన యువకుడు చనిపోయాడు. తాగునీటి ట్యాంకర్‌ (ట్రాక్టర్‌) గోతిలో పడిన ఘటనలో డ్రైవర్‌ ప్రాణం కోల్పోయాడు. రోడ్డు ప్రమాద మృతుడిని చూసేందుకు ద్విచక్రవాహనంలో బయల్దేరిన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడటంతో మృతి చెందాడు. నూతన సంవత్సరం తొలిరోజున జిల్లా వ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

రాయదుర్గంటౌన్‌ : నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి 12.15 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. న్యూ ఇయర్‌ వేడుకల్లో పాల్గొనేందుకు మునిసిపల్‌ పరిధిలోని పైతోట కాలనీ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో గల రాయదుర్గానికి శివప్ప (24), రవి (21) ఒక ద్విచక్రవాహనంపై, మరో బైక్‌పై వన్నూరుస్వామి (18), మహేష్ (18), తిమ్మప్ప(22) వచ్చారు. బైక్‌లపై కలియదిరుగుతూ హ్యాపీ న్యూయర్‌ ఇంటూ కేరింతలు కొట్టారు.

12 గంటల సమయంలో శివప్ప, రవి ఇంటికి తిరుగుపయనమయ్యారు. పైతోటలోకి రాగానే ఎదురుగా ద్విచక్రవాహనంపై వస్తున్న వన్నూరుస్వామి, మహేష్, తిమ్మప్పలను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో శివప్ప, వన్నూరుస్వామి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ముగ్గురికీ తీవ్ర గాయాలు కావడంతో రాయదుర్గం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు తరలించారు. తిమ్మప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులు, క్షతగాత్రులు అందరూ భవన నిర్మాణ కార్మికులే. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన సోదరులు కావడం గమనార్హం. మృతి చెందిన శివప్పకు భార్య ఉన్నారు. రోడ్డు ప్రమాద ఘటనతో పైతోట కాలనీ శోకసంద్రంగా మారింది. మద్యం మత్తులో అజాగ్రత్తగా ద్విచక్రవాహనాలు నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

బాధిత కుటుంబాలకు పరామర్శ
రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆదివారం ఉదయం ఆస్పత్రికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.  మృతి చెందిన శివప్ప, వన్నూరుస్వామి మృతదేహాలను మార్చురిలో సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పైతోటకు వెళ్లి బంధువులను పరామర్శించి, ఆర్థికసాయం అందజేశారు. కాపుతో పాటు వైఎస్సార్‌ సీపీ నాయకులు మాధవరెడ్డి, పైతోట సంజీవప్ప, రఘు, మండల కన్వీనర్‌ మల్లికార్జున, నాగిరెడ్డిలు కూడా పరామర్శించిన వారిలో ఉన్నారు.

బైక్‌ అదుపుతప్పి యువకుడు..
హిందూపురం రూరల్‌ : చౌళూరు గ్రామానికి చెందిన ఈడిగ శ్రీనివాసులు, ఉమాదేవి దంపతుల కుమారుడు భాస్కర్‌ (23) శనివారం రాత్రి తన స్నేహితులతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు హిందూపురం వచ్చాడు. వేడుకల అనంతరం ఆదివారం వేకువజామునే తన ద్విచక్రవాహనంలో చౌళూరుకి తిరిగి పయనమయ్యాడు. సంతేబిదనూరు గేటు సమీపంలో హిందూపురం–బెంగళూరు రహదారిపైకి రాగానే అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో భాస్కర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. భాస్కర్‌ ఎంబీఎ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

ట్యాంకర్‌ అదుపుతప్పి మరొకరు..
ధర్మవరం రూరల్‌ : తాగునీటి ట్యాంకర్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి లింగుట్ల రామకృష్ణ నాయుడు (50) అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువులు, స్థానికులు తెలిపిన మేరకు.. నడిమిగడ్డపల్లి పంచాయతీ బలిజమడి తండాలో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఆదివారం ఉదయమే తండాకు నీటిని సరఫరా చేసేందుకు రామకృష్ణనాయుడు ట్యాంకర్‌తో బయల్దేరాడు. మార్గం మధ్యలో ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో ట్యాంకర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ నడుపుతున్న రామకృష్ణ నాయుడుపై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతితో  కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. మృతుడికి భార్య ధనలక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె  ఉన్నారు. ఏఎస్‌ఐ నాగప్ప సంఘటనా స్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.

బైక్‌ అదుపుతప్పి ఇంకొకరు..
శెట్టూరు :
ద్విచక్రవాహనం అదుపుతప్పి అనుంపల్లికి చెందిన నాగప్ప (58) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. కుందుర్పి సమీపంలో శనివారం జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదంలో నాగప్ప బంధువు సోమశేఖర్‌ మృతి చెందాడు. అనుంపల్లికి చెందిన మరొక వ్యక్తితో కలిసి నాగప్ప ద్విచక్రవాహనంలో కుందుర్పికి బయల్దేరాడు. బొమ్మజ్జిపల్లి సమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి గోతిలోకి దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడ్డ నాగప్పను బంధువుల సాయంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి హరినాథ్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎస్‌ హనుమంతరాయుడు, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు తిప్పేస్వామి, ఆయకట్టు సంఘం ఉపాధ్యక్షుడు రమేష్, నాయకులు మహాబలి, రామిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు వీరాంజినేయులు మృతునికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement