భార్య మృతి కేసులో భర్తకు ఐదేళ్ల జైలు
Published Fri, Oct 14 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
గుంటూరు లీగల్: భర్త వేదింపులు భరించలేక కాలిన గాయాలతో భార్య మృతిచెందిన కేసులో భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధిస్తూ ఒకటో అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎంవీ రమణ కుమారి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. గుంటూరు నగర పరిధిలోని గోరంట్లకు చెందిన మల్లంపాటి అలియాస్ యాంపాటి రామిరెడ్డి కప్‌బోర్డుల పనిచేస్తుంటాడు. పనుల నిమిత్తం అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని ముద్దనపల్లి వెళ్ళాడు. అక్కడ సుధ అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో పెళ్లికి ఇరుపక్షాల పెద్దలు అంగీకరించ లేదు. చివరకు పెద్దమనుషులు జోక్యం చేసుకుని సంఘటనకు మూడు నెలలు ముందు ఇద్దరికీ తిరుపతిలో వివాహం చేశారు.
వివాహం అనంతరం వారు గోరంట్లలో కాపురం పెట్టారు. సంఘటనకు వారం రోజుల ముందు సుధ పుట్టింటికి వెళ్తానని అడగటంతో రామిరెడ్డి ఆమెను కదిరి వరకు తీసుకెళ్లి పుట్టింటికి వెళ్ళమని చెప్పి తిరిగి గోరంట్లకు వచ్చేశాడు. తమ పుట్టింటికి రమ్మని భర్తను కోరినప్పటికి అతను నిరాకరించడంతో చేసేదిలేక ఆమే వెళ్ళింది. ఇంటి వద్ద తల్లితండ్రులు భర్త గురించి అడగడంతో కదిరి వరకు వచ్చి వెళ్ళాడని చెప్పడంతో ఆమె తండ్రి రామిరెడ్డిని ఫోన్‌లో మందలించాడు. ఈ విషయంపై రామిరెడ్డి వారిపై కోపం పెంచుకున్నాడు. అనంతరం 4 రోజులు గడిచాక రామిరెడ్డి సుధను ఆమె పుట్టింటి నుంచి గోరంట్లకు తీసుకొచ్చాడు. రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి ఆమెను వేధించడం ప్రారంభించాడు.
మనస్తాపానికి గురై..
2015 డిసెంబర్ 1న ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోనే మద్యం తాగుతూ భార్యను దూషించాడు. మనస్థాపానికి గురైన సుధ ఇంట్లోకి వెళ్ళి వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. కాలిన గాయాలతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె అదే నెల 29న మృతి చెందింది. జరిగిన సంఘటనపై నల్లపాడు పోలీసులు రామిరెడ్డిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నిందితునిపై నేరం రుజువు చేయడంతో జైలు శిక్ష, జరిమాన విధిస్తూ న్యాయమూర్తి రమణకుమారి తీర్పు చెప్పారు. ఏపీపీ పారి బాబూరావు ప్రాసిక్యూషన్ నిర్వహించగా అప్పటి సీఐ పూర్ణచంద్రరావు కేసు దర్యాప్తు చేశారు.
Advertisement