భార్య మృతి కేసులో భర్తకు 10 ఏళ్ల జైలు
Published Mon, Feb 6 2017 10:35 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
గుంటూరు లీగల్: కట్నం చాలలేదని పుట్టింటి నుంచి మరింతగా తీసుకురమ్మని భార్యను వేధింపులకు గురిచేసి హత్య చేసిన కేసులో భర్త తురక అమృతయ్యకు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ మూడో అదనపు జిల్లా జడ్జి జి.గోపీచంద్ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన తురక అమృతయ్య తాపీపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అమృతయ్యకు తాడికొండ మండలం రాయపూడి గ్రామానికి చెందిన అశ్వనితో 8 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వివాహ సమయంలో అశ్వని తల్లితండ్రులు రూ. 45వేలు నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు కట్నకానుకలుగా ఇచ్చారు. కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం అమృతయ్య దురలవాట్లకు బానిసై ఇచ్చిన కట్నం చాలలే దని భార్యను వేధించడం ప్రారంభించాడు. అమృతయ్యకు అతని తల్లి తురక భారతి మద్దతుగా నిలిచింది. వేధింపులు భరించలేని అశ్వని విషయం తల్లిదండ్రులకు తెలిపింది. వారు వచ్చి పెద్దమనుషుల ద్వారా మాట్లాడి సర్ది చెప్పి వెళ్ళారు. అయినా పద్ధతి మర్చుకోని అమృతయ్య 2013 ఆగస్టు 13న భార్య గొంతు బిగించి లాగడంతో అమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు అమృతయ్య అతని తల్లి భారతిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ అమృతయ్యపై నేరం రుజువు చేయడంతో నిందితుడికి 10 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తూ అతని తల్లి భారతిపై నేరం రుజువు కానందున ఆమెను నిర్దోషిగా విడుదల చేస్తూ న్యాయమూర్తి గోపీచంద్ తీర్పు చెప్పారు. ఏపీపీ అంచుల వరదరాజు ప్రాసిక్యూషన్ నిర్వహించగా అప్పటి ఇన్‌చార్జి డీఎస్పీ కె.జగదీశ్వరరెడ్డి కేసు దర్యాప్తు చేశారు.
Advertisement
Advertisement