పెట్రోల బంకు వ్యాపారుల మెరుపు సమ్మె
Published Thu, Nov 3 2016 11:31 PM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
* ఆయిల్ కంపెనీలు, డీలర్లకు
మధ్య కుదరని ఏకాభిప్రాయం
* కృష్ణా జిల్లాలో డీలర్ల అరెస్టులో
రాష్ట్ర వ్యాప్తంగా నిరసన
కట్టుబడిపాలెం (ఇబ్రహీంపట్నం): ఆయిల్ కంపెనీ అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లకు మధ్య వివాదం చినికికిచినికి గాలివానగా మారి రాష్ట్రంలో బంక్‌ల మూసివేతకు దారి తీసింది. ముందుగా నిర్ణయించిన మేరకు పెట్రోల్ బంక్ డీలర్ల మార్జిన్ పెంచాలని కోరుతూ గురువారం ఉదయం నుంచి ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ కొనుగోలు మానేశారు. స్థానిక హెపీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ ఆయిల్ కంపెనీల ఎదుట మధ్యాహ్నం ధర్నా చేశారు. హెచ్‌పీసీఎల్ కంపెనీ అధికారులు మాత్రం బలవంతంగా పెట్రోల్ ట్యాంకర్లను డీలర్లకు పంపసాగారు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన డీలర్లు కట్టుబడిపాలెంలోని ఆయిల్ కంపెనీ వద్దకు వచ్చి ధర్నాకు దిగారు. కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. హెచ్‌పీసీఎల్ అధికారులు ట్యాంకర్లు పంపేందుకే నిర్ణయించారు. దీనికి నిరసనగా కొంతమంది డీలర్లు రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న జీ.కొండూరు పోలీసులు ఆయిల్ కంపెనీ వద్దకు వచ్చి డీలర్లను అరెస్టు చేసి బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహించిన కృష్ణా, గుంటూరు డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. కృష్ణా జిల్లాలో డీలర్లను ఆయిల్ కంపెనీ అధికారులు వేధిస్తున్నారంటూ అన్ని జిల్లాల డీలర్లకు సమాచారం ఇవ్వడంతో గురువారం రాత్రి రాష్ట్రలలో పెట్రోల్ విక్రయాలు నిలిచిపోయాయి. ఏపీఎఫ్‌పీటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి చెంచు నరసింహారావు మాట్లాడుతూ ఆయిల్ కంపెనీల తీరు మారకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అక్రమ కేసులు పెడితే సహించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ జాతీయ కమిటీని కలిసి శుక్రవారం ఆయిల్ కంపెనీలతో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు వెళ్లారని తెలిపారు. ఆయనకు సమాచారమిచ్చి అవసరమైతే నిరసన కొనసాగిస్తామని చెప్పారు.
Advertisement
Advertisement