సమావేశంలో మాట్లాడుతున్న పాకాల శ్రీహరిరావు
రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు
గజ్వేల్ రూరల్: ‘మల్లన్న సాగర్’ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న ముంపు గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చెందవద్దని, వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునేందుకు సిద్ధమవుతుందని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు పేర్కొన్నారు.
ఆదివారం గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలు, రైతులను ప్రతిపక్షాలు ఆయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం 2013చట్టం ప్రకారం మెరుగైన పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు.
భూములు, ఇండ్లు, ఇతర వనరులు కోల్పోతున్న ప్రజలు, రైతులందరికి పరిహారంతో పాటు డబుల్ బెడ్‌రూం ఇంటి సౌకర్యం కల్పించేందుకు సిద్దంగా ఉందని, ‘మల్లన్న’ బాధితులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలన్నారు. సమావేశంలో సిద్దిపేట డివిజన్ ఇన్‌ఛార్జి మారెడ్డి రామలింగారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ కన్వీనర్ పి. వెంకట్రాంరెడ్డి, నాయకులు నర్సింలుగౌడ్, రమేష్‌గౌడ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.