వరదెత్తిన పెన్నా | Flouds In Kurnul and YSR Districts | Sakshi
Sakshi News home page

వరదెత్తిన పెన్నా

Published Tue, Aug 30 2016 10:08 PM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM

వరదెత్తిన పెన్నా - Sakshi

వరదెత్తిన పెన్నా

సాక్షి, కడప/చెన్నూరు/ఖాజీపేట: కర్నూలు జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కుందూ, పెన్నా నదులకు వరద పోటెత్తింది.  మంగళవారం ఉదయం నీటి ప్రవాహం తక్కువగానే ఉండటంతో ఖాజీపేట మండలం కొమ్మలూరు, చెన్నూరు మండలం కొక్కరాయపల్లెకు చెందిన సుమారు 23 మంది గొర్రెలు, మేకలను, పశువులను కాసేందుకు వాటిని తోలుకుని నదిలోకి వెళ్లారు. అయితే ఒక్కసారిగా ఎగువ నుంచి వరద మొదలైంది. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో ప్రవాహాన్ని అంచనా వేసిన కాపరులంతా బయటికి వెళ్లాలని నిర్ణయించుకుని స్పీడుగా నడక ప్రారంభించారు. నది మధ్యలోకి రాగానే గొంతు వరకు నీరు వచ్చి చేరడంతో బెదిరిపోయారు. అడుగు ముందుకేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో గడ్డమీదికి చేరారు.
ఐదారు గంటలపాటు నది మధ్యలోనే..
ఒంటి గంట నుంచి సాయంత్రం 5.30 వరకు నది మధ్యలోనే బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీశారు. రెండు చోట్ల బాధితుల కేకల విని జనం అక్కడకు చేరారు. అధికార యంత్రాంగానికి సమాచారమిచ్చారు. కాపాడటానికి జనాలు విశ్వప్రయత్నాలు చేసినా నది మధ్య కావడంతో ఎవరూ ముందడుగు వేయలేదు.
వెంటనే స్పదించిన కలెక్టర్, ఎస్పీ
నది మధ్యలో ఇరుక్కుపోయిన విషయం తెలియగానే కలెక్టర్‌ కేవీ సత్యనారాయణతోపాటు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ స్పందించారు. ఎస్పీ పోలీసు సిబ్బందిని పంపి సహాయక చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా తెప్పలు తెప్పించి బాధితులను బయటికి రప్పించడంతోపాటు గొర్రెలు, మేకలు, లేగదూడలను కూడా పడవ ద్వారా బయటికి తీసుకొచ్చారు. ఎస్పీ రామకృష్ణ  చెన్నూరు బ్రిడ్జి వద్దనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బ్రిడ్జి వద్ద డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, ఆర్డీఓ చిన్నరాముడు, సీఐ సదాశివయ్యతోపాటు ఎస్‌ఐ హుసేన్‌లు అక్కడికక్కడే ప్రత్యేక చర్యలు చేపట్టడంతోపాటు బ్రిడ్జిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
సంఘటనా స్థలంలో ఎమ్మెల్యేలు
చెన్నూరు వద్ద పెన్నా ప్రవాహంలో 13 మంది బాధితులు చిక్కుకున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి నేరుగా బ్రిడ్జి వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అంతకుముందే కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ, ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణలతో రవిరెడ్డి చర్చించారు. సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను కోరారు. నది మధ్యలో ఉన్న బాధితులతో కూడా సెల్‌ఫోన్‌లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని, బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. బ్రిడ్జి వద్దనే చాలాసేపు ఎమ్మెల్యే గడిపారు. అలాగే సంఘటన ప్రాంతానికి టీడీపీ నాయకులు పుత్తా నరసింహారెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డిలు కూడా చేరుకున్నారు. అలాగే మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడా కొమ్మలూరు వద్ద నదిలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు కృషిచేశారు. అధికారులను అప్రమత్తం చేశారు.
నది మధ్యలోనే పశువులు
సుమారు 20కి పైగా పశువులు..వాటి లేగ దూడలను రక్షించడానికి ప్రయత్నించగా కష్టం కావడంతో ప్రస్తుతం నది మధ్యలోనే పశువులు ఉండిపోయాయి. అయితే ప్రస్తుతానికి నీటిమట్టం తగ్గుతోందని, తద్వారా ఉదయానికి పశువులు బయటికి వచ్చే అవకాశం ఉందని కడప అర్బన్‌ సీఐ సదాశివయ్య ‘సాక్షి’కి తెలియజేశారు. చెన్నూరులోని గాంధీనగర్‌కు చెందిన దేవరాజు పశువులు మాత్రం నదిలో కొట్టుకపోయాయి.
భారీగా తరలివచ్చిన జనం
నది మధ్యలో బాధితులు ఇరుక్కుపోవడంతో సంబంధిత గ్రామాల ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూశారు. చెన్నూరు బ్రిడ్జి వెంబడి ఇటువైపు నుంచి అటువైపు వరకు మొత్తం జనాలతో రద్దీ ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఒకపక్క వాహనాలు వెళ్లడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
21 మందిని రక్షించాం: ఎస్పీ రామకృష్ణ
కొమ్మలూరు వద్ద 9 మందిని, చెన్నూరు వద్ద కొక్కరాయపల్లెకు చెందిన 13 మందిని నది నుంచి రక్షించినట్లు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. రెవెన్యూ, అగ్నిమాపక, మత్స్యశాఖతోపాటు పోలీసుశాఖ సంయుక్త సహకారంతో వారందరినీ సురక్షితంగా బయటికి చేర్చామని తెలియజేశారు. స్పీడు పడవలు పనిచేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తెప్పల సాయంతో అందరినీ బయటికి తీసుకొచ్చామని తెలియజేశారు. ప్రత్యేకంగా మత్స్యకారులు, కొందరు పోలీసులు బాగా పనిచేశారని పోలీసుశాఖ తరఫున రివార్డు ఇస్తూనే ప్రభుత్వం తరఫున కూడా రివార్డులు అందించేందుకు కృషిచేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement