
మమా అనిపించారు..!
- మొక్కుబడిగా సాగిన ఆహార సలహా సంఘం సమావేశం
- ఎవరూ లేనప్పుడు సమావేశం ఎందుకన్న వైఎస్సార్‌సీపీ నేత బాలనాగిరెడ్డి
జిల్లా స్థాయి ఆహార సలహా సంఘం సమావేశం రెండేళ్లగా నిర్వహించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన సమావేశమూ తూతూ మంత్రంగా సాగింది. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యభవన్‌లో డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి అధ్యక్షతన ఆహార సలహా సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తప్ప ప్రజాప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాలేదు. ఇక రాజకీయ పార్టీలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నుంచి ఎస్.బాలనాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, టీడీపీ ప్రతినిధి టి.మాధవనాయుడు హాజరయ్యారు. సమావేశంలో డీఆర్‌ఓ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జి కలెక్టర్ ఆ ఏర్పాట్లలో నిమగ్నమైనందున హాజరు కాలేదన్నారు. తేదీ ముందుగా ప్రకటించిన కారణంగానే సమావేశం నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఐఏఎస్ అధికారుల సమావేశం ఉంది.. కాబట్టి నేను కూడా కొద్దిసేపు ఉండి వెళతాను. సభ్యులు తమ సూచనలను మెంబర్ కన్వీనర్ డీఎస్‌ఓ ప్రభాకర్‌రావుకి ఇవ్వండి. వాటిని ఆయన నోట్ చేసుకుంటారని చెప్పారు.