నిడమర్రు: 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రై వేట్ విద్యార్థులుగా హాజరై రాసే విధానాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యాశాఖ అధికారులు రద్దు చేశారు. దీంతో రెగ్యులర్ విద్యార్థులుగా ఎస్‌ఎస్‌సీ పరీక్షలు రాసేందుకు వారంతా ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో తప్పనిసరిగా 10వ తరగతిలో నమోదై ఉండాలి. ఆ పాఠశాలలో అడ్మిషన్ పొందేందుకు ‘ప్రత్యేక వార్షిక ఉమ్మడి పరీక్షలు’ తప్పనిసరిగా హాజరవ్వాల్సి ఉంది. వీటి గురించి తెలుసుకుందాం..
విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకూ ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నమోదు చేసుకునేందుకు ఎటువంటి అర్హత పరీక్షలు నిర్వహించకూడదు. బాలుడు/బాలిక వయసు ఆధారంగా ఆయా తరగతిలో విద్యార్థి అడ్మిషన్ పొందవచ్చు. అయితే 9వ, 10వ తరగతుల్లో ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ పొందాలంటే తప్పనిసరిగా జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ నిర్వహించే ‘ప్రత్యేక వార్షిక ఉమ్మడి పరీక్షలు’ రాసి ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రంతో ఆయా తరగతుల్లో అడ్మిషన్ నమోదు చేస్తారు. ప్రై వేట్ పాఠశాలల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ఈ విద్యా సంవత్సరం ప్రై వేట్ విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులుగా అర్హత పొందేందుకు వీలుగా ప్రత్యేక ఉమ్మడి పరీక్షను జిల్లా అధికారులు నిర్వహిస్తున్నట్టు నిడమర్రు ఎంఈవో పాశం పాండురంగారావు తెలిపారు. సంబంధిత పాఠశాలల్లో వచ్చేనెల 2 వ తేదీలోపు విద్యార్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు ..వయసు: 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 2016 ఆగస్టు 31 నాటికి 13 ఏళ్లు నిండి ఉండాలి. 10వ తరగతి ప్రవేశ పరీక్షకు 2016 వచ్చేనెల 31 నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి.
సిలబస్: 9వ తరగతి ప్రవేశ పరీక్షలో 8వ తరగతి స్టేట్ బోర్డు సిలబస్, 10వ తరగతి ప్రవేశ పరీక్షలో 9వ తరగతి స్టేట్ బోర్డు సిలబస్‌లో ప్రశ్నలు ఉంటాయి.
సీసీఈ మాదిరి ప్రశ్నాపత్రం
50 మార్కులకు సీసీఈ మాదిరిలో ఉన్న ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉంటుంది. నిర్దేశించిన తేదీల్లో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష తేదీ ఉదయం మధ్యాహ్నం
వచ్చేనెల 16 తెలుగు గణితం
వచ్చేనెల 17 హిందీ భౌతిక శాస్త్రం
వచ్చేనెల 18 ఇంగ్లిష్ జీవ శాస్త్రం
వచ్చేనెల 19 సాంఘికశాస్త్రం ––––
ఫీజు వివరాలు: దరఖాస్తుతోపాటు రూ.700 రుసుం చెల్లించాలి. కార్యదర్శి, జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ, పశ్చిమగోదావరి, ఏలూరు వారి పేరున రూ.700ను బ్యాంక్ డీడీ రూపంలో వచ్చేనెల 2లోపు సంబంధిత పరీక్ష కేంద్రాల పాఠశాలల్లో దరఖాస్తుతో అందజేయాలి. దరఖాస్తులు ఆయా కేంద్రాల వద్ద ఉచితంగా అందిస్తారు.
పరీక్ష కేంద్రాలు..
ఏలూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల
జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల
కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల
తాడేపల్లిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల
తణుకు జెడ్పీ ఉన్నత పాఠశాల
భీమవరం పీఎస్‌ఎం బాలికల ఉన్నత పాఠశాల
పాలకొల్లు ఎంఎంకేఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాల