పేగు బంధాన్ని మరచి..
తల్లిని కాటికి సాగనంపేందుకు కుమారుడి నిరాకరణ కూతుళ్లే తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్న వైనం వలిగొండ మండలం సుంకిశాలలో విషాదం పుత్రులు పున్నామనరకం నుంచి విముక్తి కలిగిస్తారని నానుడి...కానీ ఓ సుపుత్రుడు కన్నతల్లి రుణం తీర్చుకోవడానికి నిరాకరించాడు.. అవసాన దశలో ఆలనా పాలనా చూడాల్సిందిపోయి.. తనకు సంబంధం లేదని తెగదెంపులు చేసుకున్నాడు.. చివరకు కాటికి సాగనంపేందుకు కూడా ముఖం చాటేసి మానవ సంబంధాలకు మచ్చతెచ్చాడు.
నల్గొండ జిల్లా : వలిగొండ మండలం సుంకిశాలకు చెందిన బొక్క పద్మారెడ్డి, బొక్క కమలమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు సంతానం. పద్మారెడ్డి మిలిటరీలో పనిచేస్తూ వ్యవసాయం చేసేవాడు. కొన్ని కారణాలతో హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో సంతానమంతా చిన్న పిల్లలు. కుమారుడు రాజిరెడ్డికి రెండు సంవత్సరాల వయస్సు ఉంటుంది. అప్పటి నుంచి కమలమ్మ వ్యవసాయం చేస్తూ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పిల్లలను పెంచి పెద్ద చేసింది. అందరి వివాహాలు జరిపించి తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చింది. రెండు సంవత్సరాల క్రితం వరకు కుమారుడు, ఆయన కుటుంబం ఆమెతోనే ఉండేవారు. పింఛన్ డబ్బులు కూడా ఆ కుటుంబానికి కొంత ఖర్చుపెట్టేది.
ఏం జరిగిందో కానీ రెండేళ్ల క్రితం అతను సుంకిశాల విడిచి, తల్లిని అక్కడే వదిలేసి హైదరాబాద్‌కు వెళ్లి పోయాడు. దీంతో కమలమ్మ అదే గ్రామంలో ఉంటున్న చిన్న కూతురైన లలిత ఇంట్లో ఉంటుంది. ఇటీవల అనారోగ్యం బారిన పడి మంగళవారం మృతిచెందింది. ఈ సమాచారం కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు రాజిరెడ్డికి చేరవేశారు. తలకొరివి పెట్టడానికి రమ్మని పిలిచారు. అయినా అతను తనకు సంబంధం లేదంటూ తాను రానని ఖరాకండిగా చెప్పాడు. దీంతో గత్యంతరం లేక కూతుర్లే తలకొరివి పెట్టారు. ఈ దృశ్యం పలువురిని కంట తడిపెట్టించింది. ఇలాంటి కొడుకులు ఉన్న ప్రయోజనం ఏంటని అనుకుంటున్నారు.