‘అదే జరిగితే ప్రపంచ పటంలో పాక్ ఉండదు’
తిరుపతి : ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్ను భారత సైన్యం వ్యూహాత్మకంగా విజయవంతం చేసిందని భారత మాజీ లెఫ్ట్నెంట్ జనరల్ ఏఆర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ’సాక్షి టీవీ’ తో మాట్లాడుతూ ...దాడి విషయంలో ఇందుకు 10 ఏళ్లుగా పక్కాగా సేకరించిన సమాచారం ఎంతో ఉపయోగపడిందన్నారు. ఆలస్యంగా అయినా పాకిస్తాన్కు భారత్ సైన్యం తగిన బుద్ధి చెప్పిందని ఏఆర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.
యుద్ధం వచ్చినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, యుద్ధాన్ని భారత సైనిక దళాలు ధీటుగా ఎదుర్కొంటాయని ఏఆర్ రెడ్డి తెలిపారు. అణు అస్త్రాలు ప్రయోగిస్తామంటూ పాకిస్తాన్ బెదిరింపులకు పాల్పడుతోందని, వాటి ప్రయోగం అంత సులువు కాదని ఆయన అన్నారు. అదే జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదని ఏఆర్ రెడ్డి అన్నారు.
కాగా సీమాంతర ఉగ్రభూతంపై భారత్ పంజా విసిరిన విషయం తెలిసిందే. భారత సైన్యం బుధవారం అర్థరాత్రి నియంత్రణ రేఖను దాటి మెరుపు దాడి చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పొంచిఉన్న ఉగ్రమూకలను అంతమొందించింది. సుమారు నాలుగుగంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ లో 38మంది ఉగ్రవాదులతో పాటు, వారికి మద్దతు ఇస్తున్న ఇద్దరు పాక్ సైనికులు కూడా చనిపోయినట్లు అంచనా.