మేం ఉండాలా? పోవాలా?
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకునేప్పుడు, మంత్రిని చేసేప్పుడు మాకెలాంటి ఇబ్బంది ఉండదనీ, పార్టీలో మా ప్రాధాన్యత అలాగే ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. పార్టీలో మాకు విలువే లేకుండా పోయింది. చిన్నస్థాయి అధికారులు కూడా మామాట వినడం లేదు. మా సహనానికీ హద్దు ఉంటుంది. అవసరం కోసం పార్టీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారు. అందుకే మహానాడుకు రాకుండా మా బాధ తెలియ చెప్పాం. ఇట్లా చేస్తా ఉంటే మేం ఉండాలా? పోవాలా?’ అని మాజీమంత్రి పి. రామసుబ్బారెడ్డి, ఆయన చిన్నమ్మ లక్ష్మీదేవమ్మ సీఎం చంద్రబాబునాయుడుతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం అమరావతిలో వారు చంద్రబాబును కలిశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తే గానీ మేం తలెత్తుకుని తిరగలేమని, ఆ తర్వాత మీ ఇష్టమని కుండబద్ధలు కొట్టారు.
పీఆర్‌కు తగ్గిన ప్రాధాన్యం
వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకునేప్పుడు, ఆయన్ను మంత్రిని చేసేప్పుడు రామసుబ్బారెడ్డి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. పార్టీ అవసరాల రీత్యా ఆదికి మంత్రి పదవి ఇస్తున్నామనీ, రామసుబ్బారెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం స్వయంగా బుజ్జగించారు. అయితే ఆది మంత్రి అయ్యాక రామసుబ్బారెడ్డి పరిస్థితి దయనీయంగా మారింది. మండలస్థాయి అధికారులు కూడా మంత్రి చెప్పిందే చేస్తూ పీఆర్‌ని ఆయన కుటుంబీకులను లెక్కలోకే తీసుకోవడం లేదు. దీంతో గత కొంతకాలంగా రామసుబ్బారెడ్డి, ఆయన కుటుంబీకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కడపలో నిర్వహించిన మినీ మహానాడుకు డుమ్మా కొట్టారు. విశాఖపట్నంలో జరిగిన మహానాడుకు హాజరుకావాలని సీఎం స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినా హాజరుకాకుండా తమ నిరసన తెలియచేశారు. జిల్లా పార్టీ నేతృత్వంలోజరిగే ముఖ్య కార్యక్రమాలతోపాటు, నియోజకవర్గంలో ఎలాంటి పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదికీ, మాజీమంత్రి పీఆర్‌కి మధ్య సంబం«ధాలు మరింత చెడిపోయాయి.
ఎమ్మెల్సీ పదవితో సమాంతర రాజకీయం
చంద్రబాబు హామీ ఇచ్చినట్లు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి పొంది ఆ అధికారంతో నియోజకవర్గంలో మంత్రి ఆదికి సమాంతరంగా రాజకీయం నడపాలని పీఆర్ కుటుంబం నిర్ణయించుకుంది. ఇదే సమయంలో సీఎం సమయం ఇవ్వడంతో శనివారం ఆయన్ను కలిశారు. ప్రాంతీయ సమన్వయం, సామాజిక సమన్వయం కారణాలు చెప్పి గవర్నర్ పదవి ఇవ్వకుండా మరోసారి తమను మోసగించొద్దని వారు చంద్రబాబుకు గట్టిగా చెప్పారు.
ఆది నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇచ్చిన హామీ ఉత్తిదే అయ్యిందనీ, నియోజకవర్గంలోను, మా గ్రూపు జనం దగ్గర తలెత్తుకోలేని పరిస్థితి కల్పించారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదినారాయణరెడ్డి నుంచి తమకు ఎదురవుతున్న సమస్యలన్నీ క్షుణ్ణంగా సీఎంకు వివరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం వారిని సముదాయించారు. మంత్రి ఆదితో తాను స్వయంగా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని బుజ్జగించి పంపారు.
కమిషనర్ బదిలీపై ఆగ్రహం
జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన లక్ష్మీరాజ్యం తమ మాట వినడం లేదని రామసుబ్బారెడ్డి ఆమెను బదిలీ చేయించారు. ఆ స్థానంలో మధుసూదన్‌రెడ్డిని నియమింప చేసుకున్నారు. ఆది మంత్రి కాగానే మధుసూదన్‌రెడ్డిని బదిలీ చేయించి మళ్లీ లక్ష్మీరాజ్యంను నియమింప చేసుకున్నారు. ఈ పరిణామం రామసుబ్బారెడ్డికి ఆయన కుటుంబీకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తాము వద్దని బదిలీ చేయించిన కమిషనర్‌ను తమతో ఒక్కమాట కూడా చెప్పకుండానే మళ్లీ తేవడం తమను అవమానించినట్లేనని భావించారు. ఈ విషయం మున్సిపల్‌శాఖ మంత్రి పి. నారాయణ దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం లేకపోయింది. నియోజక వర్గంలోని ఇతర అధికారులు కూడా మంత్రి చెప్పినట్లే వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక రాజకీయం చేయడం ఎందుకని రామసుబ్బారెడ్డి చేతులెత్తేసి కూర్చుకున్నారు.
జమ్మలమడుగుకు కొత్తగా మంజూరైన బార్ అండ్ రెస్టారెంట్‌ను తమ మద్దతుదారులకు ఇప్పించుకోవాలని రామసుబ్బారెడ్డి భావించారు. ఇందుకోసం మున్సిపల్ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందే ప్రయత్నం చేశారు. ఈ నెల 28న మున్సిపాలిటీలోని సంబంధిత అధికారులందరూ సెలవు పెట్టో, అందుబాటులో లేకుండానో పోయారు. ఇదే ట్రేడ్ లైసెన్స్‌ను దేవగుడి నారాయణరెడ్డి అల్లుడు నరసింహారెడ్డికి మంజూరు చేశారు. పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న తాము మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోలేని దయనీయ స్థితికి చేరుకోవడంతో రాజకీయ భవితవ్యంపై రామసుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మకు భయం మొదలైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయంగా అడ్రస్ లేకుండా పోతామనే నిర్ణయానికి వచ్చారు.