చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్మనోహర్ ఆందోళన
చిత్తూరు (అర్బన్): ‘అప్పుడు ఆమరణదీక్షలో ఉన్న కాపు నాయకుడు రంగాను చంపించారు. ఇప్పుడూ అదే ఆమరణ దీక్షలో ఉన్న ముద్రగడ పద్మనాభాన్ని మట్టుబెట్టాలని చూస్తున్నారు. ఆయనకేమైనా జరిగితే టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు’ అని జిల్లా బలిజ (కాపు) సంఘ నాయకులు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ హెచ్చరించారు.
శనివారం చిత్తూరులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కాపులను ఓట్ల కోసం వాడుకుని వదిలేస్తున్నాయే తప్ప వారి భవిష్యత్తుపై ఆలోచన చేయడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకమునుపు సీఎం అయితే ఆర్నెలల్లో కాపుల్ని బీసీల్లో చేరుస్తామని, ఏటా వెయ్యి కోట్లు కార్పొరేషన్‌కు ఇస్తామని చెప్పడం వల్లే నేడు ముద్రగడ ఆ హామీల అమలు కోసం పోరాడుతున్నాడన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల గత నాలుగేళ్లలో 350 మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయన్నారు.
తమను కూడా బీసీల్లో చేర్చి నిరుపేదలుగా ఉన్న కాపు యువత అభ్యున్నతికి తోడ్పడాలని కోరారు. తునిలో జరిగిన ఘటనలో బాబు తొలుత సీమకు చెందిన వారే బాధ్యులని తప్పుడు ప్రకటనలు ఇచ్చారని, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తులను అరెస్టు చేయడమే ఇందుకు సాక్ష్యమని తెలిపారు. ‘సాక్షి’పత్రికలో రాసినట్లు ప్రస్తుతం జిల్లాలో కాపులు వీధుల్లో అడుగుపెట్టకుండా పోలీసులు వెంటాడుతున్నారని వాపోయారు. తనకు సైతం పోలీసుల నుంచి వేధింపులు తప్పడంలేదన్నారు. ముఖ్యమంత్రి కమిటీలతో కాలయాపన చేయకుండా వెంటనే కాపులకు రిజర్వేషన్లు కల్పించడంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు అమరనాథ్, వేణుగోపాల్, లోకేష్, కుట్టిరాయల్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.