సిరులు కురిసే వేళ కన్నీరు | formers financial problem | Sakshi
Sakshi News home page

సిరులు కురిసే వేళ కన్నీరు

Published Sat, Dec 17 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

సిరులు కురిసే వేళ కన్నీరు

సిరులు కురిసే వేళ కన్నీరు

  • అన్నదాతను కుదిపేస్తున్న కరెన్సీ కల్లోలం
  • ఖరీఫ్‌ కరుణించిన వేళ.. దెబ్బ తీసిన పెద్ద నోట్ల రద్దు
  • బ్యాంకు ఖాతాలకు జమవుతున్న ధాన్యం సొమ్ములు
  • ఖాతాలో వేల రూపాయలున్నా చేతికి అందని వైనం
  • తీరని పాత అప్పులు 
  • కొత్తగా పెట్టుబడి పెట్టలేని దుస్థితి
  • రబీ సాగుపై పెను ప్రభావం
  • నేలతల్లి పంటసిరులు కురిపిస్తున్న వేళ.. ఆ సిరులు చేతికి అందక అన్నదాత కంట కన్నీరు ఒలుకుతోంది. కోత కోసి, కుప్ప నూర్చిన కూలీలకు ఇవ్వాలన్నా.. రెండో పంట రబీకి పెట్టుబడి పెట్టాలన్నా.. అవసరాల మేరకు బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు తీసుకోలేని దైన్యంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్‌ సాగుకోసం అప్పులు తెచ్చి, పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరిగిపోతున్నాయి. అటు దాళ్వాకు పెట్టుబడి పెట్టే దారి కానరావడంలేదు. రెండో పంట పనుల్లో ఈపాటికే బిజీగా ఉండాల్సిన వేళ.. బ్యాంకులవద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎదురైంది. పాత పెద్ద నోట్లను రద్దు చేయడం.. కొత్త పెద్ద నోటు రూ.2 వేలను చెలామణీలోకి తేవడం 
    ద్వారా మోదీ ప్రభుత్వం సృష్టించిన కరెన్సీ కల్లోలం.. జిల్లా అన్నదాతలను 
    కుదిపేస్తున్న వైనంపై ‘సాక్షి’ ఫోకస్‌..
     
    మండపేట :
    ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందిందన్న అన్నదాతల ఆనందాన్ని ప్రస్తుత కరెన్సీ సంక్షోభం ఆవిరి చేస్తోంది. పండిన పంటతో పెద్ద పండగకు సిద్ధమవ్వాల్సిన తరుణంలో పెద్ద నోట్ల రద్దు వారికి పెద్ద కష్టాలనే తెచ్చిపెట్టింది. మద్దతు ధరకు మించి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా చేతికి చిల్లిగవ్వ కూడా చిక్కడం లేదు. ప్రతి రోజూ ఇచ్చే రూ.2 వేల కోసం రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి. అటు తొలకరి అప్పులు తీర్చలేక.. దాళ్వాకు కొత్త అప్పులు పుట్టక.. సమయం మించిపోతున్నా ఏరువాక సాగలేక అన్నదాతలు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నెల 15వ తేదీ నాటికే నాట్లు పూర్తి కావాల్సి ఉండగా.. చేతిలో డబ్బులు లేకపోవడంతో దాళ్వా సాగులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెలాఖరు వరకూ నాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
    జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని దాదాపు 4.2 లక్షల ఎకరాలు, ఏలేరు పరిధిలో సుమారు 35 వేల ఎకరాల్లో రబీ సాగు జరుగుతుంది. తొలకరి కోతల అనంతరం నేల పదునుపై ఉండగానే రైతులు దాళ్వా పనులు చేపడుతుంటారు. మార్చి నెలాఖరు నాటికి గోదావరి నీటిలభ్యతను దృష్టిలో ఉంచుకొని, డిసెంబర్‌ 15వ తేదీ నాటికి నాట్లు పూర్తి చేసేవారు. కానీ, ఈసారి పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో పెట్టుబడులు పెట్టేందుకు రైతులవద్ద డబ్బుల్లేక దాళ్వా పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలోని మండపేట, అనపర్తి, ఆలమూరు, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో ఖరీఫ్‌ కోతలు పూర్తయి, దాదాపు 20 రోజులు కావస్తున్నా ఇంకా దాళ్వా పనులు జోరందుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
    అవసరానికి అందని డబ్బులు
    జిల్లాలోని 2.19 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ వరి సాగు చేయగా, సుమారు 13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. జిల్లావ్యాప్తంగా 275 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. గత ఏడాది 2.63 లక్షల హెక్టార్లలో 16.11 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రాగా, 12.22 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుత సీజ¯ŒSలో ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 3.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి మొత్తం రూ.498 కోట్లకుగానూ ఇప్పటివరకూ రూ.410 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేస్తున్నారు. కామ¯ŒS వెరైటీ 75 కేజీల బస్తా ధాన్యానికి రూ.1,102.50 మద్దతు ధర కాగా, జిల్లాలోని పలుచోట్ల మిల్లర్లు దీనికంటే రూ.60 నుంచి రూ.100 వరకూ అధికంగా చెల్లిస్తున్నారు. దీంతో రైతులు నేరుగా మిల్లులకే ధాన్యాన్ని తరలిస్తున్నారు. బ్యాంకుల ద్వారానే చెల్లింపులు జరగాల్సి ఉండటంతో రైతులు తీసుకువచ్చిన ధాన్యానికి మిల్లర్లు చెక్కులు అందిస్తున్నారు.
     
    రబీలో ఎకరాకు సాగు ఖర్చు
    వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం రబీ సాగు కోసం 
    ఎకరాకు రూ.30 వేల వరకూ ఖర్చవుతుంది. సాగు ప్రారంభించిన మొదటి నెల రోజుల్లో ఆయా రూపాల్లో పెట్టుబడులకు రూ.12 వేల వరకూ అవసరమవుతాయని అంచనా. రబీ సాగు వ్యయం ఈ విధంగా ఉంటుంది.
    దమ్ము, పట్టి లాగడానికి, పారలంక వేయడానికి : రూ.3,000
    పంట కోత, నూర్పిడి : రూ.6,000 – రూ.8,000
    పురుగు మందులు : రూ.4,500 – రూ.6,000
    ఎరువులు :  రూ.3,500 – రూ.4,000
    ఊడ్పు : రూ.3,500 – రూ.5,000
    నారుమడి ఖర్చు :  రూ.1,500
    విత్తనం ఖరీదు :  రూ.900
    కలుపు ఖర్చు : రూ.2,000
     
    పెట్టుబడులకు దారేదీ..!
    జిల్లావ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల మంది రైతులుండగా వీరిలో అధిక శాతం మంది కౌలురైతులే ఉన్నారు. అప్పులు చేసి సాగుకు పెట్టుబడులు పెట్టడం వీరికి పరిపాటి. ఎరువులు, పురుగు మందులను దుకాణాల నుంచి అరువుపై తీసుకుని, సాగు అనంతరం పంట అమ్మగా వచ్చిన సొమ్ములతో అప్పులు తీరుస్తూంటారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో, ఖరీఫ్‌ ధాన్యం అమ్మగా వచ్చిన సొమ్మంతా బ్యాంకు ఖాతాల్లోనే జమ కావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కోతలు కోసిన కూలీలకు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో.. కొత్తగా నాట్లు వేసే కూలీలకు సొమ్ములెక్కడ నుంచి తేవాలని ఆవేదన 
    చెందుతున్నారు. ఎరువుల దుకాణాల్లో పాత అప్పులు చెల్లించకపోవడంతో, దాళ్వా సాగుకు ఎరువులు తెచ్చేందుకు అవసరమైన డబ్బులు ఎలా తేవాలని అయోమయానికి గురవుతున్నారు.
     
    చేతిలో చిల్లిగవ్వ లేదు
    పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులకు నోట్ల సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో వేలాది రూపాయలు ఖాతాల్లో ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నా రూ.2 వేల నుంచి రూ.4 వేలకు మించి ఇవ్వడం లేదు. ఓపక్క కుటుంబ పోషణ, మరోపక్క రబీ పెట్టుబడులకు ఈ సొమ్ములు చాలక ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పంట చేతికందిందన్న ఆనందాన్ని పెద్ద నోట్ల రద్దు ఆవిరి చేస్తోందని వాపోతున్నారు. పలుచోట్ల బ్యాంకుల్లో సొమ్ములు లేవని చెబుతుండటంతో ధర్నాలకు దిగుతున్నారు. బ్యాంకర్ల తీరును నిరసిస్తూ 
    కపిలేశ్వరపురం మండలం అంగరలో రైతులు, స్థానికులు ఆందోళనకు దిగారు. 
     
    చివరిలో ఇక్కట్లే..
    కాలువల ఆధునికీకరణ పనులు, సాగునీటి లభ్యత దృష్ట్యా మార్చి నెలాఖరుకు రబీ సాగు పూర్తి చేయాలి. ఇందుకోసం ఈ నెల 20వ తేదీ నాటికే నాట్లు పూర్తి కావాల్సి ఉంది. దమ్ము, నారుమడులు, నాట్లు, ఎరువులు తదితర వాటి కోసం సాగు ప్రారంభంలో రూ.10 వేలు అవసరమవుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అంత సొమ్ము చేతిలో లేని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత రబీ సాగులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. సాధారణంగా తూర్పు డెల్టాలోని మండపేట, అనపర్తి నియోజకవర్గాల పరిధిలో డిసెంబర్‌ 15వ తేదీకే నాట్లు పూర్తి చేస్తూంటారు. ఈసారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆయాచోట్ల ఈ నెలాఖరు వరకూ నాట్లు పడే పరిస్థితి ఉండగా, తూర్పు డెల్టాలోని మిగిలిన ప్రాంతాలు, మధ్య డెల్టా పరిధిలో జనవరి నెలాఖరు వరకూ నాట్లు పడతాయని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో సాగు చివరిలో నీటి ఎద్దడి తలెత్తి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
     
    పెట్టుబడి పెట్టే దారి లేదు
    ఆరెకరాలు కౌలుకు చేస్తున్నాను. తొలకరి పంటలో ఎకరానికి 25 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. మొత్తం ధాన్యాన్ని మిల్లుకు తోలితే చెక్కు ఇచ్చారు. బ్యాంకులో వేసి అప్పుడే దాదాపు నెల రోజులవుతోంది. తొలకరి సాగు కోసం రూ.లక్ష వరకూ అప్పు చేశాను. బ్యాంకులోని డబ్బులు వస్తేనే కానీ అప్పు తీరే దారి లేదు. కొత్తగా రబీ సాగు చేయాలన్నా ఆ డబ్బులే దిక్కు. పాత అప్పు తీరిస్తేనే కానీ కొత్తగా అరువుపై ఎరువులు ఇవ్వరు. బ్యాంకుకు వెళ్తూంటే రోజుకు రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారు. రోజూ బ్యాంకుల వద్ద పడిగాపులు పడలేకపోతున్నాం.
    – గుబ్బల శ్రీనివాస్, కౌలు రైతు, మండపేట
     
    15 రోజులుగా ఎదురు చూస్తున్నాను
    నాలుగు ఎకరాల్లో పండిన ధాన్యాన్ని కొంత కొనుగోలు కేంద్రాల్లో అమ్మాను. ఆ రెండుచోట్లా ధాన్యం డబ్బు బ్యాంక్‌ అకౌంట్లలోకి వేస్తామన్నారు. ధాన్యం అమ్మి 15 రోజులైంది. రబీ పనులు మొదలు పెడదామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. బ్యాంకుకు వెళితే రూ.4 వేలు వస్తుందంటున్నారు. 
    – చిక్కం నాగ లక్ష్మణరావు, రైతు, సన్నవిల్లి, ఉప్పలగుప్తం మండలం
    కూలీలకు డబ్బులివ్వలేకపోతున్నాను
    నాలుగెకరాల్లో పండించిన ధాన్యాన్ని కమిష¯ŒS ఏజెంటు ద్వారా వారం రోజుల కిందట మిల్లరుకు అమ్మాను. డబ్బులు నా బ్యాంకు అకౌంట్‌లో వేశారు. ధాన్యం ఒబ్బిడి చేసిన కూలీలకు ఇంకా డబ్బులివ్వాలి. బ్యాంకులకు వెళ్లి డబ్బుల కోసం గంటల తరబడి నిలబడ్డాను. రబీ పనులు మొదలు పెట్టాను. ఆ పనులన్నీ పక్కన పెట్టి బ్యాంకుకు వెళ్లాలి.
    – కటికదల నాగేశ్వరరావు, రైతు, దేవగుప్తం, అల్లవరం మండలం
     
    ధాన్యం అమ్మినా ఆనందం లేదు
    పదెకరాలు కౌలుకు చేస్తున్నాను. పంట అమ్మగా వచ్చిన సొమ్ముకు చెక్కు ఇవ్వడంతో నగదంతా బ్యాంకు అకౌంట్‌లోనే జమైపోయింది. తొలకరి పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఇంకా తీర్చలేదు. దాళ్వాకు ఎక్కడి నుంచి అప్పులు తీసుకురావాలో తెలీడం లేదు.
    – బొంతు సత్యనారాయణ, కౌలు రైతు, చెల్లూరు
    రూ.5 వేలలోపే ఇస్తామంటున్నారు
    ధాన్యం అమ్మిన సొమ్ము రూ.90 వేలు ఆంధ్రాబ్యాంకులో వేశారు. ఆ నగదు తీసుకునే అవకాశం లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. అప్పులు, కుటుంబ అవసరాలు తీరని దుస్థితి. బ్యాంకుకు వెళ్తే రూ.5 వేల లోపే ఇస్తామంటున్నారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా పట్టుమని రూ.10 వేలు కూడా తీసుకోలేకపోయాను.
    – గుబ్బల అప్పారావు, రైతు, బాలవరం, రంగంపేట మండలం
    రూ.2 వేల కోసం నాలుగుసార్లు బ్యాంకుకు తిరిగా..
    ధాన్యం అమ్మగా వచ్చిన రూ.10 వేల చెక్కు బ్యాంకులో వేశాను. ఇప్పటివరకూ రూ.2 వేలు తీసుకోవడానికి నాలుగుసార్లు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వచ్చింది. కూలి పనులు మానుకుని, బ్యాంకు వద్ద పడిగాపులు పడితేనే కానీ నగదు చేతికి అందడం లేదు.
    – వెంగళపతి రాజారావు, రైతు, దొడ్డిగుంట, రంగంపేట మండలం
    పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలి?
    సార్వాలో పండించిన పంట ఒబ్బిడి చేసి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాం. వాటికి సంబంధించిన డబ్బు బ్యాంకు ఖాతాలో వేస్తామంటున్నారు. బ్యాంకులకు వెళ్తే డబ్బు లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో దాళ్వా సాగు చేయడానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకు రావాలో అర్థం కావడం లేదు.
    – గంధం శ్రీనివాస్, గెద్దాడ, మామిడికుదురు మండలం
    లైనులో నిలబడాల్సి వస్తోంది
    ఎనిమిదెకరాల్లో పండించిన ధాన్యం అయినవిల్లి సొసైటీ ద్వారా అమ్మాను. దీనికి సంబంధించి రూ.2.64 లక్షలు నా బ్యాంకు ఖాతాలో వేశారు. బ్యాంకుకు వెళ్తే రోజుకు రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారు.  ధాన్యం డబ్బు ఒకేసారి ఇప్పించే ఏర్పాట్లు చేయాలి.
    – పొత్తూరి సత్యనారాయణరాజు, కౌలు రైతు, అయినవిల్లి
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement