రాయచోటి : స్థానిక కొత్తపల్లెలోని అలీమాబాద్‌వీధిలో నివాసం ఉన్న పఠాన్ ఫయాజ్‌ఖాన్ అనే వ్యక్తి హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు వివరాలను సోమవారం సాయంత్రం అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. గత నెల 6వ తేదీన ఫయాజ్‌ఖాన్‌ను షేక్.యూనస్, షేక్.ముష్రఫ్, షేక్.కమాల్‌బాషా, షేక్. మహమ్మద్‌అలీలు కలిసి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అలీమాబాద్‌వీధికి చెందిన యూనస్, ముష్రఫ్‌లు జులాయిగా తిరుగుతూ మహిళలను వేధించేవారు. అలాగే హతుడు ఫయాజ్‌ఖాన్ బంధువులకు చెందిన మహిళలను కూడా వేధించారు. ఈ విషయం తెలిసిన ఫయాజ్‌ఖాన్ వారిని మందలించాడు. దీనిని అవమానంగా భావించిన యూనస్, ముష్రఫ్‌లు కమాల్‌బాష, మహమ్మద్‌అలీలతో కలిసి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఫయాజ్‌ఖాన్‌ను తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ కేసులో నిందితులు నలుగురిని సోమవారం మదనపల్లె మార్గంలోని రింగు రోడ్డు వద్ద అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాయచోటి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు రమేష్‌బాబు, మైనుద్దీన్, మహమ్మద్‌రఫీ పాల్గొన్నారు.