కడప : గండికోట ముంపువాసుల పునరావాస కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రేపు (శనివారం) జరిగే కేబినెట్ సమావేశంలో ముంపువాసులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. చవటపల్లిలో నీరు చేరిన ఇళ్లను అవినాష్ రెడ్డితో పాటు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఇవాళ పరిశీలించారు.
అనంతరం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ... నిర్వాసితులకు న్యాయం చేయకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా గండికోట ప్రాజెక్టు ముంపు వాసులకు తక్షణమే పరిహారం అందించాలని వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. నిర్వాసితుల్ని పరామర్శించేందుకు వెళుతున్న పార్టీ నేతలను కూడా మధ్యలోనే పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా గండికోట రిజర్వాయరులో ముంపునకు గురయ్యే ఆరు గ్రామాల్లో చవటపల్లె మొదటిది. గత రెండు నెలల నుంచి అవుకు రిజర్వాయరు నుంచి గండికోటకు నీరు వచ్చి చేరుతోంది. ఆర్ అండ్ ఆర్ ప్రకారం పరిహారం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ అంగీకరించింది. అయితే, గ్రామంలోని ఇళ్ల చుట్టూ నీరు చేరుతున్నా పరిహారంపై ఉలుకూపలుకూ లేకపోవటంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమకు పరిహారం ఇస్తే సంతోషంగా ఇళ్లు ఖాళీ చేసి, వెళ్లిపోతామని.. లేకుంటే తాము మునిగినా సరే కదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు. రోడ్డుపైనే వంటావార్పూ చేపట్టారు. నాలుగు రోజులుగా నిర్వాసితుల ఆందోళను కొనసాగుతోంది. అయితే వారిని పరామర్శించేందుకు కూడా అధిరానేలే అటువైపు వెళ్లేందుకు కూడా సాహసం చేయడం లేదు. ఈ పరిణామం నిర్వాసితుల్లో మరింత పట్టుదలను పెంచుతోండడం విశేషం.