అవినీతి ‘సాగర’ం | fraud in works | Sakshi
Sakshi News home page

అవినీతి ‘సాగర’ం

Published Fri, Sep 2 2016 12:53 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

అవినీతి ‘సాగర’ం - Sakshi

అవినీతి ‘సాగర’ం

శ్రీశైలం మాజీ ఈఓ సాగర్‌బాబు ఇంటిపై ఏసీబీ దాడులు
– గతంలో పలు అవినీతి ఆరోపణలు
– బినామీగా జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌?
– దాడుల సమాచారంతో పరారీ
– అంతకు ముందు బ్యాంకు లాకర్‌ తెరవడంపై అనుమానాలు


శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో డిప్యూటీ కమిషనర్‌గా, ఆ తర్వాత రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ హోదాలో కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన ఈఓ సాగర్‌బాబు అవినీతి ఎట్టకేలకు బట్టబయలైంది. గురువారం విజయవాడలోని ఈ మాజీ ఈఓ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించడం శ్రీశైలంలో కలకలం రేపింది. అక్కడ లభించిన నగదు, బంగారం, డాక్యుమెంట్లు చూసి భక్తుల గుండె అదురుతోంది. ఆగస్టు 15, 2014లో శ్రీశైలం దేవస్థానం ఈఓగా సాగర్‌బాబు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని మామూళ్లకు తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక ఉన్నత స్థాయి ఉద్యోగితో పాటు ముగ్గురు కిందిస్థాయి ఉద్యోగులు ఆయనకు సహాయ సహకారాలు అందించినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఓ రాజకీయ ప్రముఖుడు ఆయనకు అండగా నిలిచినట్లు చర్చ జరుగుతోంది. శ్రీశైలం దేవస్థానం అభివద్ధిలో భాగంగా సుమారు రూ.137 కోట్ల వ్యయంతో చేపట్టిన మాస్టర్‌ప్లాన్‌ పనుల నిర్వహణలో అడ్డగోలుగా బిల్లులు చెల్లిస్తూ దేవస్థానం ఖజానాకు గండి కొట్టారనే ఆరోపణలను సాగర్‌బాబు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్‌ సెక్రటరీలతో పాటు ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది.  విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సైతం పలుమార్లు తనిఖీలు చేసి నివేదిక సిద్ధం చేసినా.. ఆ తర్వాత విచారించి వదిలేసినట్లు సమాచారం.

అవినీతి మరకలు కొన్ని..
– పాతాళగంగ వద్ద స్నానఘాట్లు, దుస్తులు మార్చుకునే గదులు, కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణానికి రూ.5కోట్లతో టెండర్లు పిలువగా.. పనులు పూర్తి కాకుండానే రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు.
– స్నాన ఘాట్లకు వెళ్లే దారిలో కొండను తొలగించాలని సొంత నిర్ణయం తీసుకొని సుమారు రూ.3కోట్ల దుర్వినియోగం.
– రెండేళ్ల వ్యవధిలో మాస్టర్‌ ప్లాన్‌ పనుల్లో ఒక్కటీ పూర్తి చేయలేకపోవడం.
– రింగ్‌ రోడ్డు, అంతర్గత రహదారులకు గ్రావెల్‌ తరలింపులో ఇష్టారాజ్యం.
– దేవస్థానంలో వసతి సౌకర్యాల కొరత ఉండడంతో క్వార్టర్స్‌ కేటాయింపు విషయంలో ఒక్కో గృహం కేటాయింపునకు రూ.లక్ష వరకు లబ్ధి.
– కల్యాణ కట్ట వద్ద 50 మందికి పైగా క్షురకుల నియామకానికి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షకు పైగా వసూలు.
– శానిటేషన్‌ విభాగంలో 10 మంది ఔట్‌ సోర్సింగ్‌ స్వీపర్ల నుంచి రూ.లక్ష వరకు వసూలు.
– రూ.14.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పిలిగ్రిం షెడ్ల నిర్మాణంలో పనులు పూర్తి కాకపోయినా బిల్లుల చెల్లింపుతో నిధుల స్వాహా.

అర్చక, పరిచారక నియామకాల్లో..
శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయంలో పనిచేయడానికి అర్చక, పరిచారక నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారనే చర్చ జరిగింది. ఈ విషయంపై కేసు పెండింగ్‌లో ఉండగానే కమిషనర్‌ అనుమతి తీసుకోకుండానే వారిని రెగ్యులర్‌ ప్రాతిపదికపై నియమించారు. ఒక్కో అర్చకుడు, పరిచారకుడి నుంచి రూ.లక్ష మొదలు రూ. 2లక్షల వరకు ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2016 మార్చి నెలలో నూతన అర్చకులను గర్భాలయంలో విధులు నిర్వహించడానికి ఉత్తర్వులు ఇచ్చినందుకు రూ.4లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. అప్పటికే ఆలయంలో ఉన్న వారు ముడుపులు ఇచ్చుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంతర్గత బదిలీల్లోనూ చేతివాతం
అంతర్గత బదిలీల్లోనూ ఒక్కో ఉద్యోగి నుంచి రూ. 30 వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు ప్రచారం ఉంది. అర్హత లేని టెక్నికల్‌ ఉద్యోగులలో ఇద్దరికి అర్హతను ఆపాదించి వారి చేత రూ.కోట్లలో బిల్లులు చెల్లించిన విషయమై విచారణ కూడా జరుగుతోంది. అన్నదాన విభాగంలో ఒక వ్యక్తిని తొలగంచి ఆయన స్థానంలో మరో వ్యక్తిని నియమించేందుకు రూ.4లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

బినామీగా మారిన జూనియర్‌ అసిస్టెంట్‌
కన్సాలిడేటెడ్‌ పే కింద కంప్యూటర్‌ ఆపరేటర్‌గా చేరిన వ్యక్తి అనంతర కాలంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పదొన్నతి పొందాడు. అతడిని బినామీగా మార్చుకుని దేవస్థానం గోశాలలో పేపర్‌ ప్రకటన ఇవ్వకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఐదు పోస్టులను సృష్టించి ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల వరకు జూనియర్‌ అసిస్టెంట్‌ ద్వారా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సాగర్‌బాబు ఇంట్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు.. శ్రీశైలంలోని బినామీ వ్యవహారం తెలిసి ఇక్కడికి రాగా శ్రీనివాస్‌ తెలివిగా తప్పించుకున్నట్లు సమాచారం. విషయం ముందుగానే తెలుసుకున్న ఆ వ్యక్తి శ్రీశైలం ఆంధ్రా బ్యాంక్‌లోని లాకర్‌ను గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు తెరచి విలువైన డాక్యుమెంట్లను తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement