
ఇంటి నుంచి గెంటేశారు
కడప అర్బన్:
అతను జిల్లా పోలీసు యంత్రాంగంలో పోలీస్ కానిస్టేబుల్‌గా దాదాపు పదేళ్లు పనిచేశాడు. తెలిసీ తెలియక చేసిన తప్పిదానికి ఉద్యోగాన్ని కోల్పోయాడు. కుటుంబ పోషణ కోసం విధిలేని పరిస్థితుల్లో 25 సంవత్సరాల పాటు రిక్షా తొక్కాడు. నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి దిద్దాడు. ఇప్పుడు అతని వయస్సు 85 సంవత్సరాలు. ఇంతకాలం తమ భవిష్యత్తు కోసం పరిశ్రమించిన కన్న తండ్రిని బిడ్డలు కాలదన్నారు. బయటకు వెళ్లి అడుక్కుతినుపో అంటూ నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో కడప ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండగా సమాచారం అందుకున్న పరమాత్మ సేవా సంస్థ చైర్మన్, ఏఎస్‌ఐ మలిశెట్టి వెంకటరమణ అక్కడికి చేరుకుని ఆ వృద్ధుడిని అక్కున చేర్చుకుని పరమాత్మ తపోవనం ఆశ్రమానికి తీసుకెళ్లారు. అతడిని కదిలిస్తే కన్నీరు ఉబికి వస్తోంది. తన పేరు నల్లబల్లె రాజారత్నం అని, కడప నగరంలోని అక్కాయపల్లెలో నివాసముండేవాడినని, ఇప్పుడు కన్నబిడ్డలు వద్దని నెట్టేశారని తన దయనీయ గాథను వివరించాడు.