
నేటి నుంచి జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నీ
సాఫ్ట్‌బాల్ జాతీయ టోర్నీని అనంతలో జరపడం ఆనందదాయకమైన విషయమని జాతీయ సాఫ్ట్‌బాల్ సీఈఓ ప్రవీణ్ అనౌకర్ తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం నుంచి జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నీ ప్రారంభం అవుతుందన్నారు. జాతీయ క్రీడల నిర్వహణకు అనంత క్రీడాగ్రామం చాలా అనువైనదన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే అంతర్జాతీయ జట్టు ఎంపిక టోర్నీ అనంతరం జరుగుతుందన్నారు. క్రీడాకారులను ఎంపిక చేయడంతో పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ప్రస్తుతం జరిగే టోర్నీకి సాఫ్ట్‌బాల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఏమీబ్రాండ్ హాజరవుతారన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే అంతర్జాతీయ జట్టు ఎంపిక ఉంటుందన్నారు. 2012 లో అనంత జాతీయ క్రీడకు వేదికగా నిలిచిందని, రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్ద టోర్నీకి మొదటిసారి వేదికగా మారిందని తెలిపారు. అనంత క్రీడా గ్రామంలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించే బాల, బాలికల జట్లను ఎంపిక చేశామన్నారు.