ఏలూరు (మెట్రో): జిల్లాలో రూ.350 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు నిర్మాణ పనులను వచ్చే మార్చిలోపు పూర్తిచేసేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నట్టు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. నగరంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీర్లతో ఉపాధి హామీ పథకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, జెడ్పీ పాఠశాలల్లో బెంచీల ఏర్పాటు వంటి అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఆరు నెలల్లో ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు రు.132 కోట్లు వేతనాలుగా అందించామని చెప్పారు. రానున్న మార్చిలోపు మరో రూ.100 కోటుల వేతనాలు అందించేలా పనులకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లాకు 1.80 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరుకాగా 60 వేల దొడ్లు మాత్రమే పూర్తయ్యాయని, డిసెంబర్‌లోపు నూరుశాతం నిర్మాణాలు పూర్తిచేయాలని సూచించారు. జెడ్పీ సీఈవో డి.సత్యనారాయణ, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీర్లు పాల్గొన్నారు