ఏసీబీకే కళ్లు తిరిగేలా.. | gajuwaka sub register illegal assets | Sakshi
Sakshi News home page

ఏసీబీకే కళ్లు తిరిగేలా..

Published Tue, Jun 20 2017 12:18 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

ఏసీబీకే కళ్లు తిరిగేలా.. - Sakshi

ఏసీబీకే కళ్లు తిరిగేలా..

► గాజువాక సబ్‌ రిజిస్టార్‌ అక్రమాస్తుల చిట్టా

సాక్షి, విశాఖపట్నం/గాజువాక/కూర్మన్నపాలెం/అక్కిరెడ్డిపాలెం: గాజువాక సబ్‌ రిజిస్ట్రార్‌ దొడ్డపనేని వెంకయ్యనాయుడు అక్రమాస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులకే కళ్లు బైర్లుకమ్మాయి. నాలుగేళ్ల పాటు ఉద్యోగానికి దూరంగా ఉన్నా.. అక్రమార్జనలో ఏమాత్రం వెనుకబడని అతని సంపాదన కోట్లకు పడగలెత్తింది. ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో 12 మంది అధికారులు ఏక కాలంలో 10 చోట్ల జరిపిన సోదాల్లో బయటపడ్డ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్‌ లెక్కల ప్రకారం రూ.6 కోట్లు.

మార్కెట్‌ రేటు రూ.25 కోట్లకుపైనే ఉంటుంది. విశాఖతో పాటు చిత్తూరు జిల్లాల్లో వెంకయ్యనాయుడు నివాసంతో పాటు అతని బంధువులు, బినామీల ఇళ్లల్లోనూ ఈ సోదాలు జరిగాయి. కీలక డాక్యుమెంట్లతో పాటు భారీగా స్థిర, చరాస్తులు బయటపడ్డాయి. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపిస్తున్నట్లు    ఏసీబీ అధికారులు వెల్ల డించారు.

ఆది నుంచి అక్రమాల దారి
1995 జూన్‌ 9న గ్రూప్‌–2 ద్వారా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో వెంకయ్యనాయుడు అడుగుపెట్టా డు. సబ్‌ రిజిస్ట్రార్‌గా నెల్లిమర్ల, నర్సీపట్నంలో రెండేళ్లు, గాజువాకలో ఆరేళ్లు, లంకెలపాలెంలో మూడేళ్లు, ద్వారకానగర్‌లో మూడేళ్లు, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఏడాదిన్నర, మధురవాడలో మూడు నెలలు పని చేశాడు. ఏడాదిన్నరగా గాజువాక సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మధురవాడలో ఉన్న మూడు నెలల్లో కూడా అవినీతిలో మునిగితేలిన వెంకయ్యనాయుడు 2011 జనవరి 25న ఏసీబీ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతని వద్ద అన్‌ అకౌంట్‌ మనీ రూ.85,810 ను కనుగొన్న అధికారులు కేసు నమోదు చేయడంతో నాలుగేళ్లు సస్పెండ్‌ అయ్యాడు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోలేదు. శ్రీకాకుళంలో పనిచేసిన ఏడాదిన్నరలోనే ఐదుగురితో కలిసి పార్వతీపురంలో 83 ఎకరాల్లో ప్లాట్లు వేసి విక్రయించాడు.

అక్రమాస్తుల చిట్టా ఇదీ.. : వెంకయ్యనాయుడు తన ఆస్తుల్లో కొంత భాగం తన భార్య, మామ, బావమరిది, సోదరులు, బంధువులు, బినామీల పేరుమీద పెట్టాడు. వారి ఇళ్లలో కూడా సోమవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
► నగరంలోని మహారాణిపేట ప్రాంతంలో వెంకయ్యనాయుడు నివాసం గోవిందం అపార్ట్‌మెంట్స్‌లో భారీగా డాక్యుమెంట్లు, నగలను అధికారులు గుర్తించారు.

►గాజువాకలో ఒక వ్యక్తి నుంచి రూ.1.80 కోట్ల విలుౖ వెన భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
► నరవలో భారీ సంఖ్యలో ప్లాట్లు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లను కనుగొన్నారు.

►  షీలానగర్‌లో నివాసముంటున్న సబ్‌ రిజిస్ట్రార్‌ రెండో భార్య సోదరుడు అశోక్, తిరుమలనగర్‌లోని వి.రమణ, గాజువాక అఫీషియల్‌ కాలనీలో ఉంటున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి మల్లేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.  వెంకయ్యనాయుడు బావమరిది అశోక్‌ స్థానిక గంగవరం పోర్టులో పనిచేస్తున్నట్లు సమాచారం.

► అఫీషియల్‌ కాలనీలో రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివిధ రసీదులు, షీలానగర్‌లోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కూడా సోదాలు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
► దువ్వాడ స్టేషన్‌ రోడ్డు అప్పికొండ కాలనీలో నివాసం ఉంటున్న ఉక్కు ఉద్యోగి విందుల రమణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అతను వెంకయ్యనాయుడుకు తమ్ముడి కుమారుడు.

► వెంకయ్యనాయుడు భార్య కొమ్మినేని రూప, విందుల రమణల భాగస్వామ్యంతో పెందుర్తి మండలం నరవ ప్రాంతంలో సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో మూడు లే –అవుట్లను వేసి విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. రూ.1.26 కోట్ల విలువైన మూడు డాక్యుమెంట్లు, మూడు అగ్రిమెంట్లు లభ్యమయ్యాయి.
►  నిజానికి భార్య రూపతో 2004లోనే విడాకులు తీసుకున్నప్పటికీ ఆమెతో వెంకయ్య సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆమె తండ్రి గురవయ్యనాయుడు పేరుమీద తిరుపతిలో కొమ్మినేని రెసిడెన్సీ కొనడంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేయిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement