గళమెత్తిన డ్వాక్రా మహిళలు
అత్తిలి: డ్వాక్రా గ్రూపులకు రెండో విడతగా మంజూరు చేసిన రుణమాఫీ సొమ్ము ఇవ్వడం లేదంటూ అత్తిలి మండలం వరిఘేడు పంచాయతీ కార్యాలయంవద్ద మహిళలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రూపుల పొదుపు ఖాతాల్లో సొమ్ములు జమ చేసి నెలలు గడుస్తున్నా చేతికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు వద్దకు వెళితే నగదు లభ్యత లేదని, ఏప్రిల్‌లో ఇస్తామని చెబుతున్నారని అన్నారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ములు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై తిరుపతిపురం గోదావరి గ్రామీణ బ్యాంక్‌మేనేజర్‌ను వివరణ కోరగా నగదు విత్‌డ్రాపై ఇప్పటి వరకు ఆంక్షలు ఉండటం, నగదు లభ్యత పూర్తిస్థాయిలో లేకపోవడంతో రుణమాఫీ సొమ్ము ఇవ్వడానికి ఆటంకం ఏర్పడిందని, నగదు లభ్యతను బట్టి వారికి అందజేస్తామని చెప్పారు. త్వరలోనే గ్రూపు సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేస్తామని పేర్కొన్నారు.