‘మాసినేని లాడ్జ్’లో హైటెక్ పేకాట
– ఆరు గదుల్లో మట్కా నిర్వహణ
– యాత్రాడాట్ కామ్ పేరుతో అద్దెకు గదులు
– పక్కా సమాచారంతో వన్‌టౌన్ పోలీసుల దాడి
– 48 మంది అరెస్ట్ - రూ. 5.63 లక్షలు స్వాధీనం
– నిందుతుల్లో టీడీపీ ప్రముఖుల అనుచరులు
అనంతపురం సెంట్రల్: నగరంలో త్రీస్టార్ లాడ్జి అయిన మాసినేనిలో హైటెక్ పేకాట సాగుతోంది. పక్కా సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు లాడ్జిపై దాడులు నిర్వహించారు. మొత్తం 48 మంది పేకాటరాయళ్లను అరెస్ట్ చేసి, రూ. 5.63 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందుతుల్లో అధికార తెలుగుదేశంపార్టీకి చెందిన ప్రముఖుల అనుచరులు ఉన్నారు. వివరాలను వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో సీఐ సాయిప్రసాద్ వెల్లడించారు. నగరంలో రాజురోడ్డులోని త్రీస్టార్ హోటల్ మాసినేని లాడ్జిలో భారీ స్థాయిలో పేకాట జరుగుతోంది. పేకాటరాయళ్లు ఎవరికీ అనుమానం రాకుండా ‘యాత్ర డాట్ కామ్’ టూరిస్టు సంస్థ పేరుతో ఆరు గదులు అద్దెకు తీసుకున్నారు. ఒక్కో గదిలో కొందరు చొప్పున కూర్చొని భారీ స్థాయిలో పేకాట సాగిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపుదాడులు చేశారు. సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐలు వెంకటరమణ, నాగమధు, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొని ఒకేసారి ఆరుగదులపై దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 48 మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి రూ. 5.63 లక్షలు నగదు, విలువైన సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా పేకాట పట్టుబడిన నిందితుల్లో ఎక్కువశాతం టీడీపీ ముఖ్య నేతల అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనంతపురం, శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రానికి చెందిన ప్రజాప్రతినిధుల వద్ద చలామణి అవుతున్నవారు అధికంగా ఉన్నట్లు సమాచారం.
అలాగే వారిని విడిపించేందుకు టీడీపీ అనుచరులు ప్రయత్నాలు చేశారు. అయితే మాసినేని హోటల్‌లో ఇంత పెద్ద ఎత్తున పేకాట ఆడుతుండడం నగరంలో సంచలనం కలిగిస్తోంది. సదరు లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తొలి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నా పట్టుబడడం మాత్రం ఇదే మొదటి సారి. గతంలో ఇదే వన్‌టౌన్ పోలీసులు దాడి చేసి, నిర్వాహకులను హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తే లాడ్జిలో పేకాట ఆడడం సర్వసాధరణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సీఐ సాయిప్రసాద్ స్పందిస్తూ నగరంలో లాడ్జి నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఎవరైనా మట్కా,పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.