నీకే విఘ్నాలా!?
-
పుష్కరఘాట్ వద్ద గణేశ్ ఉత్సవాలకు అనుమతి నిరాకరణ
-
రోడ్డుపై పెట్టుకోవాలన్న అధికారులు
-
అక్కడ ట్రాఫిక్ పోలీసుల అభ్యంతరం
-
అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే..!
అధికారుల అండతో అధికార పార్టీ నేతలు అవిఘ్నుడికే విఘ్నాలు సృష్టిస్తున్నారు. ఏడేళ్లుగా నిర్వహిస్తున్న ఉత్సవాలకే ఆటంకాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా ఈ ఉత్సవాలకు సారథ్యం వహిస్తుండడం వల్లే ఇలాంటి కుయుక్తులు పన్నారని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇక్కడే ఉత్సవాలు జరిపి తీరుతామని జక్కంపూడి స్పష్టం చేశారు.
– దానవాయిపేట (రాజమహేంద్రవరం)
ఏడేళ్లుగా విభిన్న ఆకృతులతో రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో నిత్యం సుమారు 40 వేల మంది భక్తులు ఇక్కడి గణపతి విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా రాజమహేంద్రి గణేశ్ ఉత్సవ కమిటీ అనుమతి కోసం అధికారులకు దరఖా స్తు చేసుకుంది. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా రు. దీనిని అడ్డుకోవాలన్న తలంపుతో అధికార పార్టీ నేతలు అధికారులతో కలిసి కుయుక్తులు పన్నారు. ఈ నేపథ్యంలో పది రోజుల కిందటే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా, అనుమతి ఇవ్వలేదు. విచారణ కోసమని స్థానిక సబ్ కలెక్టర్, ఎస్పీ, కమిషనర్, తహసీల్దార్ వద్దకు నిర్వాహకులు హాజరయ్యారు. ఉత్సవాల వద్ద ఎలాంటి ఘటనలు జరిగినా నిర్వాహకులదే బాధ్యతంటూ అధికారులు సంతకాలు కూడా తీసుకున్నారు.
అనుమతి లేదంటూ అడ్డగింపు
వినాయక చవితికి మరో ఐదు రోజులే ఉన్న నేపథ్యంలో పుష్కరఘాట్ వద్ద నిర్వాహకులు బుధవారం ఏర్పాట్లు ప్రారంభించారు. నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేసి, విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేద ని స్పష్టం చేశారు. పుష్కరఘాట్ ఎదురుగా, రాజరాజ నరేంద్రుడి విగ్రహం పక్కన రోడ్డుపై ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఇక్కడ ఏడేళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, రోడ్డుపై ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడతాయని జక్కంపూడి రాజా.. సెంట్రల్‌జోన్ డీఎస్పీ జె.కులశేఖర్, కార్పొరేషన్ అధికారులకు వివరించారు. ససేమిరా అన్న వారు.. రోడ్డుపై ఏర్పాటుకు మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. ఇది ముగిసిన కాసేపటికే ట్రాఫిక్ పోలీసులు పుష్కరఘాట్ వద్దకు వచ్చారు. రోడ్డుపై మండపం పెడితే ట్రాఫిక్‌కు ఇబ్బందని, అనుమతి ఇచ్చేది లేదని డీఎస్పీ బి.శ్రీకాంత్ నిర్వాహకులకు చెప్పడంతో అధికార పార్టీ నేతల వ్యూహం బయటపడింది. అధికారుల తీరును నిరసిస్తూ జక్కంపూడి రాజా తన అనుచరులతో రోడ్డుపై బైఠాయించారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ను ‘సాక్షి’ వివరణ అడగ్గా.. గోదావరి నిత్యహారతికి భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందనే అనుమతి ఇవ్వలేదని చెప్పారు. రాజరాజ నరేంద్రుని విగ్రహం పక్కన గణపతి విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని సూచించామని తెలిపారు.
కావాలనే అడ్డుకుంటున్నారు : జక్కంపూడి రాజా
ఏడేళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను పుష్కరఘాట్ వద్ద ఎవరికీ ఇబ్బందులు కలగకుండా నిర్వహిస్తున్నామని జక్కం పూడి రాజా విలేకరులకు తెలిపారు. నగర పాలక సంస్థ కమిషనర్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని రాజా ధ్వజమెత్తారు. ప్రస్తుతం నిత్య హారతి పుష్కరఘాట్‌లోని దేవాలయాల మెట్టపై నుంచి ప్రవాహానికి అభిముఖంగా ఇస్తున్నారని, అందువల్ల ఇక్కడ వినాయక మండపం ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. అయినా పుష్కరఘాట్ వద్ద రెండు బ్రిడ్జీల మధ్య ఉన్న స్థలం రైల్వే, జలవనరుల శాఖదని, ఈ స్థలాన్ని రైల్వే శాఖ అద్దె ప్రాతిపదికన వ్యాపారస్తులకు వేలంలో కేటాయించిందని పేర్కొన్నారు. ఇతర శాఖలకు లేని ఇబ్బంది కమిషనర్‌కు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలంతో తమ శాఖది కాని స్థలంపై కమిషనర్ జోక్యం చేసుకుంటున్నారని నిలదీశారు. పోలీసులు కూడా రోడ్డుపై ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని చెబుతున్నా కమిషనర్ వినకుండా నిర ంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదో రోజు నుంచే రాజానగరం, అనపర్తి, జగ్గంపేట, కోనసీమలోని పలు ప్రాంతాల నుంచి నిత్యం 500 విగ్రహాలు బ్రిడ్జిలంక ఇసుక ర్యాంపులో నిమజ్జనం కోసం వస్తుంటాయని, ఘాట్ లోపల పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పినా అధికారులు వినిపించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా తాము పుష్కరఘాట్ వద్దే గణపతి ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట కార్పొరేటర్ బొంతా శ్రీహరి, పార్టీ నాయకులు సుంకర చిన్ని, దంగేటి వీరబాబు, అడపా హరి, కరుణామయ శ్రీను ఉన్నారు.