
వెళ్లిరావయ్యా.. గణపయ్యా..
- కనులపండువగా వినాయక నిమజ్జనం
- అర్ధరాత్రి 2 వరకు వరకు సాగిన కార్యక్రమం
హిందూపురం అర్బన్: వినాయక చవితి సందర్భంగా హిందూపురం పట్టణంలో కొలువుదీర్చిన వినాయకుల విగ్రహాల నిమజ్జనోత్సవం గురువారం కనులపండువగా సాగింది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన విగ్రహాల ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. స్థానిక ఐదులాంతర్ గాంధీసర్కిల్ నుంచి చిన్నమార్కెట్, అంబేడ్కర్ సర్కిల్, గురునాథ్ సర్కిల్ అనంతరం సద్భావన సర్కిల్, వీడీరోడ్డు మీదుగా శ్రీనివాసనగర్, మున్సిపల్ ఆఫీసు పక్క నుంచి గుడ్డం కోనేరు వరకు సాగింది. విగ్రహాలను ట్రాక్టర్లపై రంగురంగుల తోరణాలు, విద్యుత్ దీపాలంకరణ చేసి మేళాతాళాలతో సాగనంపారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రముఖులు తరలివచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. అలాగే వివిధ రకాల వేషధారణతో యువకులు ఆకట్టుకున్నారు.
గుడ్డం వద్ద భారీ బందోబస్తు
గుడ్డం రంగనాథస్వామి ఆలయం కోనేరు వద్ద భారీ బందోబస్తుతో వినాయకుల నిమజ్జనోత్సవం జరిగింది. డీఎస్పీ కరీముల్లా షరీఫ్, ఆర్డీఓ రామ్మూర్తి ఇతర శాఖాధికారులు నిమజ్జన కార్యక్రమం పర్యవేక్షించారు. ప్రత్యేక క్రేన్ ఏర్పాటు చేసి విగ్రహాలను అందులో ఉంచి నేరుగా కోనేరు మధ్యలో తీసుకెళ్లి నిమజ్జనం చేయించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిచర్యలు తీసుకున్నారు. కాగా నిమజ్జనోత్సవం అర్ధరాత్రి 2 గంటల వరకు సాగింది. కోనేరు వద్ద భారీగా జనం తరలివచ్చి నిమజ్జన ఉత్సవాన్ని తిలకించారు.