గ్యాస్ నిక్షేపాల కోసం ఉద్యమించాలి
-
రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నేతలు
బోట్‌క్లబ్ (కాకినాడ) :
కేజీ బేసిన్ పరిధిలోని జిల్లాలో గ్యాస్ నిక్షేపాల కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉద్యమించాలని వివిధ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్‌జీవో హోంలో సీపీఎం ఆధ్వర్యాన మంగళవారం జరిగిన అఖిలపక్షం రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, కేజీ బేసిన్‌లో రిలయన్స్ సంస్థ అక్రమంగా రూ.11 వేల కోట్ల విలువైన గ్యాస్‌ను తరలించుకుపోయిందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దీనివల్ల జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఓఎన్‌జీసీకి చెందిన నిక్షేపాలను రిలయన్స్ అక్రమంగా తరలించుకుపోయినట్టు జస్టిస్ షా కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. కేజీ బేసిన్‌లో గ్యాస్‌ను ఇక్కడి సంస్థలకు, జిల్లా ప్రజలకు ఇవ్వకుండా అక్రమంగా తరలించుకుపోవడం దారుణమన్నారు. కార్పొరేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైపోయిందని విమర్శించారు. గ్యాస్ నిక్షేపాల కోసం జరిగే న్యాయమైన పోరాటానికి తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ రియలన్స్ అక్రమాలపై ఓఎన్‌జీసీ ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ, కేజీ బేసిన్ డి6 బ్లాక్‌లో అధిక గ్యాస్ నిక్షేపాలున్నాయన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1999లో బీజేపీ పాలకులు ఈ బ్లాక్‌లో గ్యాస్ వెలికితీసే అవకాశాన్ని రిలయన్స్‌కు ఇచ్చేలా చట్ట సవరణ చేశారన్నారు. బిడ్ దాఖలు చేసే అవకాశాన్ని కూడా గుజరాత్‌కు చెందిన జీఎస్‌పీసీకి బీజేపీ ధారాదత్తం చేసిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బీజేపీకి వంత పాడి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కారని అన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ నగర కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ, షా కమిటీ రిపోర్టు బయటకు వచ్చినా పార్లమెంట్‌లో ఏవిధమైన ప్రస్తావనా రాకపోవడం శోచనీయమన్నారు. సీనరేజ్ కూడా ప్రభుత్వం వసూలు చేయలేకపోయిందన్నారు. జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ఉద్యమాలకు అండగా నిలుస్తామన్నారు.
సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు బుగతా బంగార్రాజు, సీహెచ్.నాగేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు జె.వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు నక్కా కిషోర్, బీఎస్‌పీ నాయకుడు చొల్లంగి వేణుగోపాల్, ఆర్‌పీఐ నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు, జేఏసీ మాజీ నేత ఆచంట రామారాయుడు, బీసీ సబ్‌ప్లాన్ సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు తూతిక విశ్వనాథం, జనవిజ్ఞాన వేదిక నగర అధ్యక్షుడు ఆలపాటి శ్రీనివాస్, కోనసీమ దళిత వేదిక కన్వీనర్ జంగా బాబూరావు తదితరులు కూడా మాట్లాడారు. జేఏసీ కార్యదర్శి పితాని త్రినాథరావు, వైఎస్సార్ సీపీ ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, ఐద్వా నాయకులు కె.సుభాషిణి, ఎస్.భవాని, ఉద్యోగ సంఘ నాయకులు పసుపులేటి శ్రీనివాస్, కె.నాగేశ్వరరావు, సరెళ్ళ చంద్రరావు, సూర్యనారాయణ, మాధవరావు, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.