పాతబస్తీ : ఆషాడమాసం బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా సోమవారం పాతబస్తీలో జరిగే అమ్మవారి ఘటాల ఊరేగింపుకు ఉత్సవాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సామూహిక ఊరేగింపు సందర్బంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు.
పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి దేవాలయం, మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారి దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, సుల్తాన్‌షాహి శీతల్‌మాత మహంకాళి దేవాలయం, గౌలిపురా నల్లపోచమ్మ దేవాలయం, గౌలిపురా శ్రీ మహంకాళి దేవాలయం, మురాద్‌మహాల్ శ్రీ మహంకాళి దేవాయలం, అక్కన్నమాదన్న శ్రీమహంకాళి దేవాలయం, బేలా ముత్యాలమ్మ దేవాలయం, హరిబౌలి బంగారు మైసమ్మ టెంపుల్‌లతో పాటు మరికొన్ని ప్రధాన దేవాలయాల అమ్మవారి ఘటాలు ఈ ఊరేగింపులో పాల్గొననున్నాయి.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని మహాంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఊరేగింపు సందర్బంగా ఎక్కడైనా అసౌకర్యాలు కలిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పాతబస్తీలో ఆగస్టు 1వ తేదీన జరిగే బోనాల జాతర అమ్మవారి ఘటాల ఊరేగింపుకు అదనపు బలగాలను రప్పించి బందోబస్తు నిర్వహిస్తున్నామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు.