వేగంగా వచ్చిన లారీ బాలికను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తలింగాల సమీపంలోని ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం జరిగింది.
కామేపల్లి : వేగంగా వచ్చిన లారీ బాలికను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తలింగాల సమీపంలోని ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరుగుతుండటంతో తల్లిదండ్రులతో కలిసి వచ్చిన నల్లగొండ జిల్లా మోతె మండలం సర్వారానికి చెందిన బాలిక మేదరమెట్ల రమ్య.. రోడ్డు పక్కనే ఆగి ఉన్న ఆటోలో బంధువులు ఉండటంతో రోడ్డు దాటుతూ వారి వద్దకు వెళ్తోంది. ఈ క్రమంలో మణుగూరు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఇసుక లారీ వేగంగా వచ్చి బాలికను ఢీకొట్టి.. రెండు కాళ్లపై నుంచి వెళ్లింది. కాళ్లు నుజ్జునుజ్జయి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో బంధువులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కోపోద్రిక్తులైన బంధువులు లారీ డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా.. బాలిక బంధువులు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు చెప్పారు.