విశాఖపట్నం : విద్యార్థిని తనూజ మృతి కేసులో మిస్టరీ వీడలేదు. ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు తమ దర్యాప్తు ముమ్మరం చేశారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనూజ హత్య కేసులో బంధువుల ప్రమేయంపై కూడా పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా బంధువుల ప్రమేయంపై పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు.
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కృష్ణరాయపురంలో తనూజ తన తల్లిదండ్రులతో కలసి నివసిస్తుంది. అయితే శనివారం సాయంత్రం సెల్ ఫోనులో అదే పనిగా స్నేహితుడు మాట్లాడటంతో తనూజను తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆగ్రహించిన ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది.
మరునాడు ఆదివారం ఉదయం వారి ఇంటి సమీపంలో తనూజ నగ్న మృతదేహం పడి ఉంది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఆమె స్నేహితుడుతోపాటు అతడి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.