మాయమయ్యిందా.. మాయం చేశారా?
మాయమయ్యిందా.. మాయం చేశారా?
Published Tue, May 16 2017 10:54 PM | Last Updated on Fri, Aug 17 2018 5:11 PM
యువతి ఆత్మహత్య కేసులో కీలకంగా మారిన సెల్‌ఫోన్
కనిపించకుండా పోవడంపై అనుమానాలు
పోలీసుల అదుపులో నిందితులు
పిఠాపురం : కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర్‌లో ఆదివారం బక్కే శిరీష (19) ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆమెకు చెందిన సెల్‌ఫోన్ కీలకంగా మారింది. ఆమె చనిపోయినప్పటి నుంచి సెల్‌ఫోన్ కనిపించకుండా పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ప్రేమించి మోసం చేసినట్టు చెబుతున్న నిందితుడికి సంబంధించిన ఈమెయిల్స్, ఫేస్‌బుక్ అకౌంట్స్, వాట్సాప్‌కు సంబంధించిన సమాచారం ఆఫోన్‌లో ఉంటుందని మృతురాలి బంధువులు, స్నేహితులు చెబుతుండగా ఆఫోన్ మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ ఆమె వద్దే ఉండే సెల్‌ఫోన్ ఆత్మహత్య చేసుకున్నాక గల్లంతవ్వడం, ఆ నంబర్‌కు కాల్ చేస్తే రింగయినా ఎవరూ రిసీవ్ చేసుకోపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఇప్పటికే పోలీసులు ఆసెల్‌ఫోన్ కోసం మృతురాలి ఇంట్లో సోదాలు చేసినా ఫలితం లేకపోవడంతో మరోసారి సోదాలు చేసి లేదా నెట్‌వర్క్ ద్వారా సెల్‌ఫోన్ ఎక్కడ ఉందో కనుక్కునే పనిలో ఉన్నారు. శిరీష చనిపోయే ముందు తన ఫోన్ ఎక్కడైనా పెట్టి వదిలేసిందా ? లేక ఆ హడావుడిలో ఎవరైనా దానిని తీసి ఎవరికైనా ఇచ్చారా? ముందు రింగయిన సెల్ తరువాత స్విచ్ఛాఫ్ కావడం చార్జింగ్ అయిపోవడం వల్లా లేక ఎవరైనా ఆపేసారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌ను ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. కేవలం ప్రేమ విఫలం అవ్వడం వల్లే శిరీష మృతి చెందిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆమె సూసైడ్ నోట్‌లో తన చావుకు కారణంగా చెబుతూ పేర్కొన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పిఠాపురం సీఐ అప్పారావు ఆధ్వర్యంలో కొత్తపల్లి ఎస్సై సత్యనారాయణ నిందితులను బుధవారం కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిసింది.
‘తల్లి’డిల్లే తనువు చాలించిందా ?
ప్రేమించానని నమ్మించి శారీరకంగా అవసరం తీర్చుకుని వదిలేయడం వల్ల తల్లి కాబోతున్నానన్న చేదు నిజం తెలిసి తట్టుకోలేకే ఆమె తనువు చాలించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం చేసిన వైద్యులు ఆ అనుమానంతోనే గర్భ నిర్ధారణకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకండి
సమాజంలో అనేక రకాలు మనుషులు ఉంటారు. కొందరు తమ అవసరాలు తీర్చుకోడానికి అనేక వక్రమార్గాలు పడతారు.అటువంటి వారి బారిన పడినప్పుడు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రాణాలను హరించడంతో పాటు ఆ కుటుంబాలను వీధుల పాలు చేస్తాయి. శిరీష మాదిరిగా ఎవరికైనా అన్యాయం జరిగితే చట్టం, న్యాయం ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. తమ బాధను పోలీసులకు చెప్పుకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విద్యావంతులు కూడా ఇలా అనాలోచిత చర్యలకు పాల్పడ కూడదు. ఎవరు మానసికంగా కుంగిపోకుండా ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇస్తే తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం అని సీఐ అప్పారావు సూచించారు.
Advertisement
Advertisement