కేసు ఉపసంహరణకు బెదిరింపులు
కేసు ఉపసంహరణకు బెదిరింపులు
Published Wed, May 17 2017 11:09 PM | Last Updated on Fri, Aug 17 2018 5:11 PM
రూ.2 లక్షలు తీసుకోమన్న విశ్రాంత పోలీసు అధికారి
నిరసనగా మృతురాలి బంధువుల ఆందోళన
ప్రియుడి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర్‌కు చెందిన శిరీష ప్రాణానికి ఓ విశ్రాంత పోలీసు అధికారి వెల కడుతున్నారు. ఆమె మృతికి పరిహారంగా రూ.2 లక్షలు తీసుకుని కేసు ఉపసంహరించుకోవాలంటూట ఒత్తిడి తెస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు ఉపసంహరించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి ఉంటుందని బెదిరించినట్టు వారు ఆరోపిస్తున్నారు. దీంతో వారు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
పిఠాపురం/కొత్తపల్లి : బాధితులకు రక్షణ కల్పించి, న్యాయం చేయాల్సిన పోలీసు శాఖలో 30 ఏళ్లకు పైగా పనిచేసి రిటైరైన ఒక అధికారి.. శిరీష మృతి కేసుపైఒత్తిడి చేస్తున్నారంటూ మృతురాలి బంధువులు, ఆనంద్‌నగర్ గ్రామస్తులు బుధవారం కొత్తపల్లి పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. సామర్లకోటకు చెందిన విశ్రాంత ఏఎస్సై మంగళవారం రాత్రి తమ ఇంటికి వచ్చి ‘పోయిన పిల్ల ఎలాగూ తిరిగిరాదు.. డబ్బులు ఇస్తాను తీసుకోండి కేసు వల్ల ఒరిగేది ఏమీ లేదంటూ’తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు మృతురాలి తల్లి ఆరోపించింది. డబ్బులు వద్దని, కూతురి చావుకు కారణమైన వారికి శిక్ష పడాలని చెపితే.. కేసు ఉపసంహరించుకోపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్టు ఆమె ఆరోపిస్తోంది. కన్నకూతురు కళ్ల ముందే చనిపోయి పుట్టెడు దుఃఖం ఉంటే ఆదుకోవాల్సింది పోయి ప్రాణాలకు వెల కడుతూ బెదిరింపులకు దిగుతున్న ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు. కుమార్తెను మోసం చేసి ఆత్మహత్యకు పురిగొల్పి ప్రాణాలు తీసుకునేలా చేసిన నలుగురు నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి డిమాండ్ చేసింది. కేవలం వేధింపులకు పాల్పడినట్టుగా సెక‌్షన్లు పెట్టడమే కాకుండా మరిన్ని సెక‌్షన్లు పెట్టి శిక్ష పడేలా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఆ సెక‌్షన్‌లో అన్ని కోణాలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అన్యాయం జరిగితే చట్టాన్ని ఆశ్రయించండి అని చెప్పిన పోలీసులు అదే చట్టానికి ప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ఒక అమాయకురాలి ప్రాణానికి వెల కడుతుంటే పోలీసులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు దారితీస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
నిందితుల అరెస్ట్
శిరీష ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను మీడియా ముందు హాజరుపర్చారు. ప్రియుడు ఇసకోటి విజయరత్నం అలియాస్ కన్నా, అతని తండ్రి ఇసకోటి సుందర్‌సింగ్, తల్లి కమల, సాకా రత్నం అలియాస్ బేబమ్మ లను పిఠాపురం మండలం కోలంకలో అరెస్టు చేసి కోర్టు హాజరుపరుస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. తొలుత అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన ఈ కేసులో.. వేధింపులకు పాల్పడినట్టుగా నిందితులపై (ఐపీసీ సెక్షన్ 306) ప్రకారం మార్పు చేసినట్టు ఆయన తెలిపారు.
Advertisement
Advertisement