ఇంటర్‌లో బాలికలే టాప్‌ | girls top in Intermediate results | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో బాలికలే టాప్‌

Published Fri, Apr 14 2017 1:50 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

ఇంటర్‌లో   బాలికలే టాప్‌

ఇంటర్‌లో బాలికలే టాప్‌

రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ఫస్టియర్‌ 4, సెకండియర్‌ 5వ స్థానం
 
గత ఏడాదికంటే దిగజారిన ఇంటర్‌ ఫలితాలు
శతశాతం సాధించిన గొలుగొండ, వేములపూడి కాలేజీలు


 
విశాఖపట్నం : ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలురకంటే పైచేయి సాధించారు. ఇటు ఫస్టియర్‌లోనే కాదు.. అటు సెకండియర్‌లోనూ తామే గ్రేట్‌ అని నిరూపించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 69 శాతం, ద్వితీయ సంవత్సరంలో 80 శాతం ఉత్తీర్ణతతో వీరు ముందున్నారు. గురువారం విడుదలయిన ఇంటర్‌ ఫలితాల్లో విద్యార్థినీ, విద్యార్థులు వెరసి ఫస్టియర్‌లో 66, సెకండియర్‌లో 78 శాతం సగటు ఉత్తీర్ణత సాధించారు. కాగా గత ఏడాది ఫస్టియర్‌ ఫలితాల్లో మూడో స్థానంలో ఉన్న విశాఖ ఈ సంవత్సరం నాలుగు, సెకండియర్‌లో నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి దిగజారింది.

ఈ ఏడాది మొదటి సంవత్సరం పరీక్షలకు 49,933 మంది హాజరు కాగా 33,158 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో జిల్లాలోని కేడీపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 81 శాతంతో మొదటి స్థానంలోనూ, 69 శాతం ఉత్తీర్ణతతో రెండోస్థానంలో దేవరాపల్లి కళాశాలలు నిలిచాయి.   జి.మాడుగుల జూనియర్‌ కాలేజీ 6 శాతం ఉత్తీర్ణతతో అథమం స్థానం దక్కించుకుంది. ఫస్టియర్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో 35 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధ్యమైంది. ఇందులో నగరంలోని ఏఎస్‌రాజా 49, బీవీకే కాలేజి  40 శాతంతో ప్రథమ, ద్వితీయస్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా ఏవీఎన్‌ కళాశాల 15 శాతం ఉత్తీర్ణతే పొందింది. ఒకేషనల్‌ కాలేజీ విద్యార్థులు 66 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గిరిజన సంక్షేమ కాలేజీల్లో 70.68 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రభుత్వ మోడల్‌ కాలేజీలోల 73.6 శా తం ఉత్తీర్ణత సాధించా రు. అలాగే సాంఘిక సంక్షేమ కాలేజీల్లో 74.66 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ద్వితీయ సంవత్సరం..
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోకి వస్తే 44,966 మంది పరీక్షలు రాయగా 35,155 మంది (78 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 80 శాతం ఉత్తీర్ణతతో బాలురకంటే (76 శాతం) బాలికలు అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 60.6 శాతం మంది పాసయ్యారు. 98 శాతం ఉత్తీర్ణతతో కేడీపేట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే ఎయిడెడ్‌ కళాశాలల్లో 50 శాతం మంది పిల్లలు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అత్యధికంగా సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీ 73 శాతం ఉత్తీర్ణత పొందింది. ఒకేషనల్‌ కాలేజీల్లో 81 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వీటిలో 98 శాతం ఉత్తీర్ణతతో పాయకరావుపేట జూనియర్‌ కాలేజీ అగ్రస్థానం సాధించింది. గిరిజన సంక్షేమ కళాశాలల్లో 85.6 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, 97 శాతం ఉత్తీర్ణతతో పెదబయలు కాలేజీ ప్రథమ స్థానం పొందింది. ఇక ప్రభుత్వ మోడల్‌ కాలేజీలు 73.6 శాతం ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో వేములపూడి కాలేజీ నూరుశాతం ఉత్తీర్ణత సాధించి ఆదర్శంగా నిలిచింది. సాంఘిక సంక్షేమ కాలేజీల్లో 91.5 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ కళాశాలల్లో గొలుగొండ నూరు శాతం ఫలితాలు సాధించిన ఘనత దక్కించుకుంది.

అథమ స్థానంలో..
కాగా జిల్లాలో కొన్ని కళాశాలలు అత్యల్ప ఉత్తీర్ణతతో అథమ స్థానంలో నిలిచాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జి.మాడుగుల అత్యల్పంగా 6 శాతం ఉత్తీర్ణత సాధించింది. అక్కడ 211 మంది పరీక్షలకు హాజరుకాగా కేవలం 12 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్‌ కాలేజీల్లో ఏవీఎన్‌ కళాశాల 15 శాతం, ఒకేషనల్‌ కాలేజీల్లో 36 శాతంతో మధురవాడ, గిరిజన సంక్షేమ కాలేజీల్లో కొయ్యూరు 34, సాంఘిక సంక్షేమశాఖలో 35 శాతంతో కొక్కిరాపల్లి, మోడల్‌ కాలేజీల్లో 27 శాతంతో చీడికాడ కళాశాలలు అతి తక్కువ ఫలితాలు సాధించాయి. అలాగే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అతి తక్కువగా డుంబ్రిగుడ కాలేజీలో 18 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ 116 మందికి 21 మంది పాసయ్యారు. ఎయిడెడ్‌ కాలేజీల్లో అనకాపల్లి ఏఎంఏఎల్‌ కాలేజీ 27 శాతం, ఒకేషనల్‌లో అగనంపూడి 25 శాతం, గిరిజన సంక్షేమ కాలేజీల్లో కొయ్యూరు 54 శాతం,  మోడల్‌ కాలేజీల్లో చీడికాడ 27 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement