చెదిరిన ‘సిగ్నేచర్’
గ్లోబల్ టెండర్లకు స్పందన కరువు ఫలితం
కొత్తగా మరో మిలీనియం టవర్
2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం
విశాఖపట్నం : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధిలో తనకు మించిన వారే లేరని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలు విశ్వసించడం లేదు. ఆయన చెప్పేవన్నీ కల్లబొల్లి కబుర్లేనన్న నమ్మకంతో ఐటీ పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. తెల్లారిలేస్తే భాగస్వామ్య సదస్సుల్లో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఊదరగొడ్తున్న సీఎం.. విశాఖలో ఏర్పాటు చేయబోయే సిగ్నేచర్ టవర్ నిర్మాణానికి పిలిచిన గ్లోబల్ టెండర్లకు స్పందనే లేదు. ఏళ్ల తరబడి ఎదురు చూసి, చూసి ఇక ఫలితం లేదని గ్రహించి తమ కలల సిగ్నేచర్ టవర్‌కు మంగళం పాడుతున్నారు. తాజాగా ఇప్పుడు మరో టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు...!
చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలో విశాఖలో ఐటీ జంట టవర్లను నిర్మించాలని నిర్ణయించారు. వీటికి మధురవాడ ఐటీ సెజ్ హిల్ నంబరు 3లో సుమారు 17 ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించారు. వీటి నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. తొలిదశలో నిర్మించే టవర్‌కు సిగ్నేచర్ టవర్‌గా పేరు పెట్టారు. ఇందులో ఆతిథ్య, షాపింగ్, వినోద, ఆహ్లాద కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీనికి రూ.291 కోట్లు వ్యయం అవుతుందని తేల్చింది. ఏపీఐఐసీతో బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (బీఎఫ్‌ఓటీ) విధానంలో దీనిని చేపట్టాలని నిర్ణయించి, అమెరికాకు చెందిన జేమ్స్ లాంగ్ లాసల్లే (జెఎల్‌ఎల్) అనే సంస్థను కన్సల్టెంట్‌గా నియమించింది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం పలుమార్లు గ్లోబల్ టెండర్లను పిలిచినా స్పందన రాకపోవడంతో కంగుతిన్న యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సిగ్నేచర్ టవర్ ఏర్పాటయితే అందులో ఎన్నో ఐటీ కంపెనీలు ఏర్పాటవుతాయని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. కానీ ఆశాభంగమే ఎదురయింది. ఇక సిగ్నేచర్ టవర్ సాధ్యం కాదన్న నిర్ణయానికొచ్చిన ప్రభుత్వం సరికొత్తగా మరో టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది.
మరో మిలీనియం టవర్ కోసం
సిగ్నేచర్ టవర్‌కు మంగళం పాడేసిన ప్రభుత్వం తాజాగా మిలీనియం టవర్‌ను ఏర్పాటు చేయాలని తలపోస్తోంది. ఇప్పటికే రుషికొండ ఐటీ హిల్స్ మీద మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక మిలీనియం టవర్ 2016 నుంచి నిర్మాణంలో ఉంది. ఐదంతస్తులో నిర్మిస్తున్న దీని పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి ఇది పూర్తి కావలసి ఉన్నా కనీసం మరో ఏడెనిమిది నెలలయినా పట్టవచ్చని తెలుస్తోంది. ఈలోగా సిగ్నేచర్ టవర్ షాకివ్వడంతో మరో మిలీనియం టవర్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రుషికొండ ఐటీ సెజ్‌లోని హిల్ నంబరు 3లో రెండు లక్షల చదరపు అడుగుల్లో దీనిని నిర్మించాలన్నది తాజా ప్రతిపాదన. దీనికి రూ.80 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొత్త మిలీనియం టవర్ ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమని అధికార వర్గాలు చెబుతున్నాయి.