కమనీయం..సంగమేశ్వరుని కల్యాణం
కొత్తపల్లి: సంగమేశ్వర క్షేత్రంలో సోమవారం శ్రీలలితా సంగమేశ్వరుని కల్యాణం.. కనులపండువగా నిర్వహించారు. ఉదయం ఏడుగంటల ప్రాంతంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు సప్తనదీజలాలతో వేదమంత్రాల మధ్య అభిషేకం నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలతో స్వామి, అమ్మవార్లను వధూవరులుగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం వద్దకు మేళతాళాలతో స్వామి, అమ్మవార్లను తీసుకొని వచ్చారు. బ్రాహ్మణులు వేదమంత్రాలను పఠిస్తుండగా అర్చకులు తెల్కపల్లి రఘురామశర్మ .. కల్యాణ వేడుకలను ప్రారంభించారు. ఉదయం 11గంటలకు స్వామివారి తరఫున అర్చకులు అమ్మవారి మెడలో మాంగల్యధారణ గావించారు. శ్రీలలితా సంగమేశ్వరస్వామివార్ల కల్యాణ వేడుకలను తిలకించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. మహిళా భక్తులు.. పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారెలతో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. వేడుకలను తిలకించేందుకు కర్నూలు, ఆత్మకూరు, నందికొట్కూరు ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వేడుకల్లో కలెక్టర్ సతీమణి: శ్రీలలితా సంగమేశ్వరుని కల్యాణ వేడుకలను తిలకించేందుకు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సతీమణి స్వర్ణశ్రీ, ఆయన కుమారులు వచ్చారు. వారు స్వామివారి వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సతీమణి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. వేడుకల్లో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, తహసీల్దారు రామకృష్ణ, ఇన్‌చార్జి ఎస్సై వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.